ఖజానాకు తాళం | lock treasury office | Sakshi
Sakshi News home page

ఖజానాకు తాళం

Published Mon, Sep 4 2017 3:12 AM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

ఖజానాకు తాళం

ఖజానాకు తాళం

లావాదేవీలన్నీ ఫ్రీజ్‌
నిధులన్నీ ఉప ఎన్నిక ప్రాంతాల్లోనే ఖర్చు
ట్రెజరీల్లో పేరుకు పోయిన రూ.కోట్ల బిల్లులు
నిలిచిన రోజువారీ పనులు
ఆర్థిక శాఖ అనుమతుల కోసం అధికారుల ఎదురుచూపులు
సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు


‘‘మీ చెక్కు చెల్లలేదు...డబ్బులిస్తేనే డీజిల్‌ వేస్తాం’’
- టోకెన్‌ తీసుకుని డీజిల్‌ కోసం వెళ్లిన ధర్మవరం మున్సిపాలిటీ కార్మికులకు పెట్రోలు బంకు యజమాని చెప్పిన మాటలివి.

‘‘వారం రోజులు టైమివ్వండి ...తొందర్లోనే బిల్లులు చెల్లిస్తాం...’’
- ట్రాన్స్‌కో అధికారితో ఓ మున్సిపాలిటీ ఉన్నతాధికారి విన్నపం

‘‘ట్రాక్టర్‌ రిపేరీ వచ్చి వారం రోజులైంది...అడిగితే డబ్బుల్లేవంటున్నారు...నేనేం చేసేది..మీ ఇంటిముందు చెత్తఉంటే తీసుకుపోయి...మున్సిపాలిటీ ముందు వేయండి’’

- ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఓ కార్మికుడి విసుగు

ప్రస్తుతం జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితి ఇది. చిన్నా చితకా పనులకు కూడా ట్రెజరీల్లో బిల్లులు పాస్‌ చేయకపోవడంతో మున్సిపాలిటీ అధికారులంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కోట్లాది రూపాయల బిల్లులు ట్రెజరీల్లో పెండింగ్‌లో ఉండిపోగా...పనులు జరగక ఇటు అధికారులు, సమస్యలు పరిష్కారం కాక అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ధర్మవరం: ఆవులను కొట్టి చెప్పులు దానం చేసిన చందంగా ఉంది టీడీపీ సర్కార్‌ తీరు. చిన్నా చితకా కార్మికుల పొట్టకొట్టి తమకు అవసరమైన చోట నిధుల వరద పారించడం తెలుగుదేశం ప్రభుత్వానికి అలవాటుగా మారింది. నంద్యాల, కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లో విచ్చలవిడిగా నిధులు ఖర్చు చేసేందుకుగాను ఇతర ప్రాంతాల్లో అత్యవసర వాటికి కూడా నిధులు విడుదల చేయకుండా లావాదేవీలను ఫ్రీజ్‌ చేసింది.  దీంతో జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల బిల్లులు ట్రెజరీల్లోనే పెండింగ్‌లో ఉండిపోయాయి. కనీసం చెత్త తరలించే ట్రాక్టర్లకు కూడా డీజిల్‌ పోయించడం ఇబ్బందిగా మారడంతో పట్టణాల్లో చెత్త తరలింపులో జాప్యం జరుగుతోంది. మరోవైపు  మున్సిపాలిటీల్లో కాంట్రాక్ట్‌ కార్మికులకు వేతనాలు చెల్లించలేకపోవడంతో పనులు సాగడం లేదు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత తరుణంలో కనీసం ఫాగింగ్‌ చేసేందుకు కూడా చేతిలో చిల్లిగవ్వ లేక మున్సిపాలిటీల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
ఆగస్టు నుంచి ఆగిన చెల్లింపులు
జిల్లాలోని 18 ట్రెజరీలుండగా... వీటి పరిధిలో 135 మంది డ్రాయింగ్‌ ఆఫీసర్లు (ఆయా శాఖలు/ విభాగాల పరిధిలో  నగదు లావాదేవీలు నిర్వహించే) ఉంటారు. మున్సిపాలిటీ, పంచాయతీ, తదితర సంస్థల్లో వివిధ రకాల వేతనాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు వీరు చెల్లిస్తుంటారు. అయితే వీరు పంపిన దాదాపు రూ.50 నుంచి రూ.70 కోట్ల దాకా బిల్లులను ఆర్థిక శాఖ ఫ్రీజ్‌ చేసింది. ఆగస్టు–09 నుంచి నేటి వరకు వారికి అందాల్సిన అన్ని  చెల్లింపులు మొత్తం ఆగిపోయాయి.  నంద్యాల, కాకినాడ ఎన్నికల నేపథ్యంలో అక్కడ విచ్చలవిడిగా నిధులు ఖర్చుపెట్టిన సర్కార్‌ ... రాష్ర్టంలోని మిగతా ఎక్కడా చెల్లింపులు చేయకుండా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

చిల్లిగవ్వలేక చిక్కులు
బిల్లుల చెల్లింపులు ఫ్రీజ్‌ చేసిన నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో అనంతపురం నగరపాలక సంస్థతోపాటు, 11 మున్సిపాలిటీలు ఉన్నాయి. బిల్లులు ఫ్రీజ్‌ చేయడంతో చిన్న అవసరానికీ చిక్కులు తప్పడం లేదు.  ముఖ్యంగా డీజిల్‌ ఖర్చులు, కార్మికుల వేతనాలు చెల్లించేందుకు కూడా డబ్బు లేకపోవడంతో సమాధానం చెప్పుకోలేక అధికారులు సతమతమవుతున్నారు.

చెత్త ట్రాక్టర్లు, ఆటోలు, ఇతరత్రా వాహనాలకు సంబంధించిన డీజిల్‌ బిల్లులు వారానికో.. పదిరోజులకో ఆయా పెట్రోల్‌ బంకుల యజమానులకు చెల్లిస్తుంటారు. అయితే నెలరోజులుగా చెల్లింపులు లేక పోవడంతో సేవలు సక్రమంగా అందడంలేదు. ఇక కాంట్రాక్ట్‌ కార్మికులకు అందిచాల్సిన వేతనాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. విద్యుత్‌ బిల్లులు చెల్లింపులు, పలు అభివృద్ధి పనులకు చెల్లించాల్సిన బిల్లులు అన్ని పెండింగ్‌లోనే ఉన్నాయి.  ఇలా మున్సిపాలిటీలకు సంబంధించిన బిల్లులు దాదాపు రూ. 20 నుంచి 30 కోట్ల రూపాయల బిల్లులు ట్రెజరీలో ఫ్రీజ్‌ అయ్యాయి. ఆర్థిక శాఖ అనుమతులు ఎప్పుడు ఇస్తుందో.. ఎప్పుడు బిల్లులు వస్తాయో అని స్థానిక సంస్థలు కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement