అనంతపురం: అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి పోలీసుల అదుపులో చనిపోయాడు. చెన్నేకొత్తపల్లె మండలం ముష్టికోవెల పంచాయతీ గువ్వలగొందిపల్లెకు చెందిన బత్తెన శ్రీరాములు(54) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ముష్టికోవెల సమీపంలో జూలై 24వ తేదీన గుప్త నిధుల తవ్వకాలు జరిగాయి. ఆ కేసు విచారణలో భాగంగా పోలీసులు మాలక్కగారి సంజీవప్ప, తలారి సంజీవప్ప, రొద్దం ముత్యాలు, బత్తెన శ్రీరాములను మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు.
వారిని పోలీసులు విచారిస్తున్నారు ఆ క్రమంలో శ్రీరాములు శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై పోలీస్ స్టేషన్లో చనిపోయాడు. దీంతో అతని మృతదేహాన్ని పోలీసులు ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. అతనితో పాటు పోలీసుల అదుపులో ఉన్న మరో ముగ్గురు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వారికి రహస్యంగా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. శ్రీరాములు మరణించాడని వార్త తెలిసిన అతడి కుటుంబ సభ్యులు ధర్మవరం ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసుల వల్లే శ్రీరాములు మరణించాడని వారు ఆందోళనకు దిగారు.
ధర్మవరంలో ఉద్రిక్తత
చెన్నేకొత్తపల్లి మండల పోలీసుల అదుపులో శ్రీరాములు అనే వ్యక్తి మృతి చెందటం ఉద్రిక్తతకు దారి తీసింది. శ్రీరాములు మృతదేహాన్ని పోలీసులు ధర్మవరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన శ్రీరాములు బంధువులు, కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చి, ఆందోళనకు దిగారు. దీనిపై విచారణ చేసేందుకు అక్కడి చేరుకున్న డీఎస్పీ వేణుగోపాల్‌తో వాగ్వాదానికి దిగారు.