ck palli
-
రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్
-
లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) : ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు వెనుకనుంచి ఢీకొంది. ఆర్టీసీ డ్రైవర్‌తోపాటు 15 మందికి గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన మేరకు.. శుక్రవారం రాత్రి గుంతకల్లు నుంచి ఆర్టీసీ బస్సు (ఏపీ02 జెడ్ 0374) బెంగళూరుకు బయల్దేరింది. చెన్నేకొత్తపల్లి మండల కేంద్రం సమీపాన 44వ నంబరు జాతీయరహదారిపై కోన క్రాస్ వద్ద ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో లారీని రోడ్డు పక్కన నిలిపి ఉంచారు. హెచ్చరిక కోసం చిన్నపాటి కొమ్మలు, రాళ్లను రోడ్డుపై అడ్డు పెట్టారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో అక్కడకు చేరుకున్న ఆర్టీసీ బస్సు దీన్ని గమనించకుండా ముందుకు దూసుకెళ్లింది. అంతే ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చింది. గాఢనిద్రలో ఉన్న 23 మంది ప్రయాణికులు ఉలిక్కిపడి లేచారు. లారీని బస్సు ఢీకొన్నట్లు గుర్తించారు. బస్సు తలుపులు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. డ్రైవర్ కుమార్ స్టీరింగ్ సీటులోనే ఇరుక్కుపోయాడు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని, ఎస్ఐ మహమ్మద్ రఫికి సమాచారం అందించారు. అనంతరం హైవే పెట్రోలింగ్ పోలీసులు నాగరాజు, సుబ్బరాయుడుతో పాటు పలువురు పోలీసులు ఎమర్జన్సీ డోర్ పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. బస్సులో మరో డ్రైవర్ కుళ్లాయప్ప కాలుకు గాయం కాగా.. 15 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసి 108లో అనంతపురం తరలించారు. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ తూగడం వల్లే ప్రమాదం జరిగిందని, అయితే స్పీడు తక్కువ ఉండటంతో ప్రాణహాని తప్పిందని పలువురు ప్రయాణికులు తెలిపారు. -
అమ్మానాన్న ఆత్మహత్య
- బాగోగులు పట్టించుకోని కుమారుడు - పురుగుల మందు తాగిన వృద్ధ దంపతులు - ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి - వెంకటగారిపల్లిలో దారుణం మాయమైపోతున్నడమ్మా..మనిషన్నవాడు అన్న ఓ సినీ కవి ఘోష ఈ సంఘటన చూస్తే నిజమే అనిపిస్తుంది. కొడుకు, కోడలు, మనవుడూ, మనవరాళ్లు ఉన్నా ముసలి దంపతులు ఒంటరితనంతో అలమటించారు. మాట్లాడేవారు లేక లోలోన కుమిలిపోయారు. జబ్బు చేసి కదలలేని స్థితిలో ఉన్నా పిడికెడు మెతుకులు పెట్టేవారు కరువయ్యారు. కనీసం తాగునీళ్లు ఇచ్చే దిక్కు లేని దీనస్థితిలో బతికారు. చివరకు వారు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అందరూ ఉన్నా అనాథల్లా మృతిచెందారు. ఈ దారుణం బత్తలపల్లి మండలం వెంకటగారిపల్లిలో చోటుచేసుకుంది. - బత్తలపల్లి అసలే వృద్ధాప్యం...ఆపై బాగోగులు పట్టించుకోని కుమారుడు.. జీవితంపై విరక్తి చెందిన వృద్ధ దంపతులు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మవరం రూరల్ సీఐ శివరాముడు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటగారిపల్లి గ్రామానికి చెందిన నారాయణప్ప(70), సావిత్రమ్మ(65) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ముగ్గురికీ వివాహాలు చేశారు. వీరిలో ఓ కుమార్తె భర్త పదేళ్ల క్రితం మృతిచెందాడు. రెండేళ్ల క్రితం ఒక కుమార్తె మృతి చెందింది. కుమారుడు మద్యానికి బానిసై వేరు కాపురం పెట్టాడు. పైగా మద్యం తాగొచ్చి రోజూ వారిని వేధించేవాడు. ఈ సమస్యలతో వృద్ధులు సతమతమయ్యేవారు. అయినా వృద్ధులు ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ జీవనం నెట్టుకొస్తున్నారు. ఆపరేషన్‌తో కదలలేని స్థితి.. ఇలాంటి పరిస్థితుల్లో సావిత్రమ్మకు ఆరు నెలలు క్రితం ఆపరేషన్ జరిగి కదలలేని పరిస్థితి ఏర్పడింది. పక్షవాతంతో నారాయణప్పకు సైతం ఇదే పరిస్థితి. కనీసం కాలకృత్యాలు తీర్చుకోలేని పరిస్థితి. ఇక భోజనం సంగతి దేవుడి కెరుక. కుమారుడిని ప్రాధేయపడినా చేరదీయలేదు. తమ దీన పరిస్థితిపై విరక్తి చెంది గురువారం భార్యకు విషమిచ్చి నారాయణప్ప కూడా తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు గమనించి వారిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారి కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ నసీమాభేగం తెలిపారు. విషయం తెలుసుకున్న మాల్యవంతం పంచాయతీకి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని విచారం వ్యక్తం చేశారు. -
కోన కణ్వాశ్రమం చూసొద్దాం.. రండి
చెన్నేకొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న కోన కణ్వాశ్రమం ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. చుట్టూ ఎత్తైన కొండల మధ్యన పురాతన ఆలయాలను ఇక్కడ చూడవచ్చు. జాతీయ రహదారి నుంచి దాదాపు ఐదు కిలో మీటర్ల మేర అటవీ ప్రాంతం లోపలకు వెళితే కణ్వ మహర్షి తపమాచరించిన ప్రాంతం వస్తుంది. ఈ ప్రాంతాన్నే కోన కణ్వాశ్రమమని భక్తులు పిలుస్తుంటారు. ఇక్కడ మల్లికార్జున స్వామి, రుక్మిణి సమేత పాండురంగ విఠలుడి ఆలయాలు ప్రత్యేకతను చాటుతున్నాయి. శివకేశవులు కొలువైన క్షేత్రంగానూ ఈ ప్రాంతానికి పేరుంది. ఇంకా అయ్యప్పస్వామి, ఆంజనేయ స్వామి, వేంకటేశ్వర, అక్క మహా దేవతల ఆలయాలూ ఇక్కడ ఉన్నాయి. ఒక్కసారి ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే.. మళ్లీమళ్లీ చూడాలనిపిస్తుంది. జిల్లా కేంద్రం నుంచి బెంగళూరు జాతీయ రహదారిపై 45 కిలో మీటర్ల ప్రయాణించి చెన్నేకొత్తపల్లి చేరుకుంటే ఇక్కడి నుంచి ఆటోల ద్వారా జాతీయ రహదారిపై పెనుకొండ మార్గంలో రెండు కిలోమీటర్లు వెళ్లి అక్కడి నుంచి కుడివైపుగా ఐదు కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో ప్రయాణించి కోన క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఇక్క పర్యాటకులు విడిది చేసేందుకు చక్కటి వసతి సౌకర్యం కూడా - చెన్నేకొత్తపల్లి (రాప్తాడు) -
ఎర్రచందనం దుంగలు పట్టివేత
చెన్నేకొత్తపల్లి : అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగల్ని చెన్నేకొత్తపల్లి పోలీసులు వాహనంతో సహా స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను రామగిరి సీఐ యుగంధర్, చెన్నేకొత్తపల్లి ఎస్ఐ మహమ్మద్‌రఫీ గురువారం చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరించారు. గత 15 తేదీన ఎర్రచందనం అక్రమంగా రవాణా అవుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకోగా తక్కిన వారు (తమిళనాడుకు చెందిన శివశక్తినాన్, కన్నన్కుమార్,గౌడమణి, బెంగళూరుకు చెందిన మహేంద్ర) పరారయ్యారన్నారు. తిరిగి బుధవారం ఎర్రచందనం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో నాగసముద్రం గేట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టామన్నారు. ఓ వాహనం ఆపకుండా వెళ్లిపోవడంతో దాన్ని వెంబడించామన్నారు. అయితే దుండగులు చెన్నేకొత్తపల్లి సమీపంలో వాహనాన్ని ఆపి పరరయ్యారని, దీంతో వాహనంలో ఉన్న నాలుగు ఎర్రచందనం దుంగల్ని వాహనంతో సహా (దాదాపు రూ.1లక్ష)స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన నిందితుల్ని విచారించి కోర్టులో ధర్మవరం కోర్టుకు హాజరు పరచినట్లు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
సీకేపల్లి, రాయదుర్గంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత
అనంతపురం అగ్రికల్చర్ : భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గురువారం చెన్నేకొత్తపల్లి, రాయదుర్గంలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. య్లానూరు 41 డిగ్రీలు, శింగనమల, వజ్రకరూరు, గుంతకల్లు, శెట్టూరు, పుట్లూరు, కంబదూరు, గార్లదిన్నె మండలాల్లో 40 డిగ్రీలు, పుట్టపర్తి, విడపనకల్, తాడిమర్రి, బెళుగుప్ప, రాప్తాడు, గుమ్మగట్ట, బొమ్మనహాల్, కొత్తచెరువు, బుక్కపట్టణం, ఆత్మకూరు, యాడికి, పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో 39 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 36 నుంచి 38 డిగ్రీలు కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 25 డిగ్రీల మధ్య నమోదైంది. గాలిలో తేమశాతం ఉదయం 57 నుంచి 77, మధ్యాహ్నం 18 నుంచి 28 శాతం మధ్య రికార్డయ్యింది. గంటకు 6 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఎండలు రోజురోజుకు ముదురుతుండటంతో జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, రైతులు, కూలీలు, చిరు వ్యాపారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వడదెబ్బ భయం జిల్లా వాసులను ఆందోళకు గురి చేస్తోంది. మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యమవుతున్నాయి. నీడ, నీళ్ల కోసం జనం అవస్థలు పడుతున్నారు. గొడుగులు, టోపీలు, శీతలపానీయలు, కర్భూజా, కళింగరకు డిమాండ్ ఏర్పడింది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల అమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రారంభంలోనే ఎండలు అదిరిపోతుండటంతో వచ్చే రెండు నెలల కాలం మరింత ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితి కనిపిస్తోంది. -
'అనంత'లో లాకప్ డెత్ !
-
'అనంత'లో లాకప్ డెత్ !
అనంతపురం: అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి పోలీసుల అదుపులో చనిపోయాడు. చెన్నేకొత్తపల్లె మండలం ముష్టికోవెల పంచాయతీ గువ్వలగొందిపల్లెకు చెందిన బత్తెన శ్రీరాములు(54) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ముష్టికోవెల సమీపంలో జూలై 24వ తేదీన గుప్త నిధుల తవ్వకాలు జరిగాయి. ఆ కేసు విచారణలో భాగంగా పోలీసులు మాలక్కగారి సంజీవప్ప, తలారి సంజీవప్ప, రొద్దం ముత్యాలు, బత్తెన శ్రీరాములను మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు ఆ క్రమంలో శ్రీరాములు శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురై పోలీస్ స్టేషన్లో చనిపోయాడు. దీంతో అతని మృతదేహాన్ని పోలీసులు ధర్మవరం ఆస్పత్రికి తరలించారు. అతనితో పాటు పోలీసుల అదుపులో ఉన్న మరో ముగ్గురు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వారికి రహస్యంగా ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు తెలిసింది. శ్రీరాములు మరణించాడని వార్త తెలిసిన అతడి కుటుంబ సభ్యులు ధర్మవరం ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసుల వల్లే శ్రీరాములు మరణించాడని వారు ఆందోళనకు దిగారు. ధర్మవరంలో ఉద్రిక్తత చెన్నేకొత్తపల్లి మండల పోలీసుల అదుపులో శ్రీరాములు అనే వ్యక్తి మృతి చెందటం ఉద్రిక్తతకు దారి తీసింది. శ్రీరాములు మృతదేహాన్ని పోలీసులు ధర్మవరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన శ్రీరాములు బంధువులు, కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం చేయకుండా అడ్డుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చి, ఆందోళనకు దిగారు. దీనిపై విచారణ చేసేందుకు అక్కడి చేరుకున్న డీఎస్పీ వేణుగోపాల్‌తో వాగ్వాదానికి దిగారు. -
వోల్వో బస్సు బోల్తా, ఒకరు మృతి, 10మందికి గాయాలు
అనంతరం : అనంతపురం జిల్లా సీకే పల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. వోల్వో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.