అనంతపురం అగ్రికల్చర్ : భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గురువారం చెన్నేకొత్తపల్లి, రాయదుర్గంలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. య్లానూరు 41 డిగ్రీలు, శింగనమల, వజ్రకరూరు, గుంతకల్లు, శెట్టూరు, పుట్లూరు, కంబదూరు, గార్లదిన్నె మండలాల్లో 40 డిగ్రీలు, పుట్టపర్తి, విడపనకల్, తాడిమర్రి, బెళుగుప్ప, రాప్తాడు, గుమ్మగట్ట, బొమ్మనహాల్, కొత్తచెరువు, బుక్కపట్టణం, ఆత్మకూరు, యాడికి, పామిడి, పెద్దవడుగూరు మండలాల్లో 39 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 36 నుంచి 38 డిగ్రీలు కొనసాగింది.
కనిష్ట ఉష్ణోగ్రతలు 19 నుంచి 25 డిగ్రీల మధ్య నమోదైంది. గాలిలో తేమశాతం ఉదయం 57 నుంచి 77, మధ్యాహ్నం 18 నుంచి 28 శాతం మధ్య రికార్డయ్యింది. గంటకు 6 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఎండలు రోజురోజుకు ముదురుతుండటంతో జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, రైతులు, కూలీలు, చిరు వ్యాపారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వడదెబ్బ భయం జిల్లా వాసులను ఆందోళకు గురి చేస్తోంది. మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యమవుతున్నాయి. నీడ, నీళ్ల కోసం జనం అవస్థలు పడుతున్నారు. గొడుగులు, టోపీలు, శీతలపానీయలు, కర్భూజా, కళింగరకు డిమాండ్ ఏర్పడింది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల అమ్మకాలు పెరుగుతున్నాయి. ప్రారంభంలోనే ఎండలు అదిరిపోతుండటంతో వచ్చే రెండు నెలల కాలం మరింత ఇబ్బందుల్లోకి నెట్టే పరిస్థితి కనిపిస్తోంది.
సీకేపల్లి, రాయదుర్గంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత
Published Thu, Mar 9 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM
Advertisement