హిందూపురంలో దోపిడీ
- కొరియర్ బాయ్‌నంటూ వచ్చి ఇంట్లోకి జొరబడి..
- పట్టపగలే రూ.4 లక్షల బంగారు నగలు, రూ.లక్ష నగదుతో పరారీ
హిందూపురం అర్బన్ : హిందూపురంలో నిత్యం రద్దీగా ఉండే ఎంఎఫ్ రోడ్డులోని ఓ ఇంటిలోకి దొంగలు పథకం ప్రకారం చొరబడ్డారు. ఇంట్లోని వృద్ధురాలిని మరణాయుధాలతో బెదిరించారు. ఆనక బంగారు నగలు, నగదుతో ఉడాయించారు. గురువారం పట్టపగలు జరిగిన ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. స్థానిక ఎంఎఫ్ రోడ్డులోని మండి మార్చెంట్ కృష్ణమూర్తి, అతని కుమారులందరూ సొంత పనుల కోసం బయటకు వెళ్లారు. దొంగలు అదే ఇంటిని టార్గెట్ చేశారు. ఇంట్లో వృద్ధురాలు మంజుల మాత్రమే ఉందని పసిగట్టి, దోపిడీకి పథకం పన్నారు. గడియ పెట్టిన తలుపు వద్దకు ఇద్దరు వచ్చి ‘మీకు అర్జెంట్ కొరియర్’ వచ్చిందని తెలిపారు. వృద్ధురాలు తలుపుతీసే లోపే వారే గడియాను తీసి లోనికి చొరబడ్డారు.
ఆ వెంటనే వృద్ధురాలి మెడపై కత్తి పెట్టి అరిస్తే చంపేస్తామని బెదిరించారు. డబ్బు ఎక్కడ దాచోరో చెప్పాలని గద్దించారు. ఆమెను వెంటబెట్టుకుని ఇల్లంతా కలియతిప్పారు. డబ్బు లేదని, దేవుడి గదిలో వెండి పూజ సామగ్రి ఉందని ఆమె చెప్పగా.. ఒంటిపైనున్న నగలు తీసుకొని, తనను వదిలేయాలని ఆమె ప్రాధేయపడింది. దీంతో దొంగలు ఆమె నోటికి ప్లాస్టర్ వేసి.. చేతులు కట్టేసి వంటింట్లో బంధించారు. తర్వాత రూ.4 లక్షలు విలువ చేసే బంగారు మంగళ్యం చైను, రెండు గాజులు, చెవి కమ్మలు, రూ.లక్ష నగదు ఎత్తుకుపోయారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ సీఐ ఈదుర్‌బాషా తమ సిబ్బందితో కలసి ఆ ఇంటిని పరిశీలించారు. ఆధారాల కోసం క్లూస్ టీంను రప్పించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.