ఎక్కడికక్కడే!
మూడురోజులుగా రోడ్డెక్కని లారీలు
- నేటి నుంచి సమ్మెలోకి సరుకు రవాణా వాహనాలు
- స్తంభించనున్న రవాణా రంగం
– ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాడుతామంటున్న ప్రైవేట్ లారీ ఓనర్స్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రైవేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ చేపట్టిన దక్షిణ భారతదేశ లారీల సమ్మె రోజురోజుకు ఉద్ధృతమవుతోంది. మూడు రోజుల (మార్చి 30) నుంచి దాదాపు 80 శాతం లారీలు రోడ్డెక్కడం లేదు. ఆదివారం నుంచి అత్యవసర సరుకు రవాణా చేసే లారీలు కూడా సమ్మెలోకి వెళ్తున్నాయి. దీంతో ఆహారపు సరుకులు, కూరగాయలు, రైతుల పండించిన పంటలను రవాణా చేయడం కష్టంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
లారీల సమ్మెను తేలికగా తీసుకున్న ప్రభుత్వం
దక్షిణ భారతదేశ వ్యాప్తంగా ప్రైవేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీల సమ్మెకు పిలుపునిచ్చారు. మొదటి రోజు నుంచి సమ్మె ఉద్ధృతంగా సాగుతోంది. ఎక్కడికక్కడే లారీలను నిలిపివేసి ఓనర్లు, డ్రైవర్లూ ప్రభుత్వాల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ లారీల సమ్మెను తేలికగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇంతవరకు కనీసం వారితో చర్చలు జరిపి డిమాండ్లు ఏమిటనే విషయాన్ని కూడా అడగడం లేదు. దీంతో అసోసియేషన్‌నాయకులు అత్యవసర సేవలను అందించే లారీలను సైతం సమ్మెలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదివారం నుంచి వారు కూడా సమ్మెలో పాల్గొంటారని చెబుతున్నారు. పాలు, పెట్రోలు, కూరగాయలు, ఆహారపు సరుకులు, ఇతర పదార్థాలను తీసుకెళ్లే వాహనాలు సమ్మెలోకి వెళ్లితే ప్రజలపై తీవ్ర భారం పడే అవకాశం ఉంది. ఎక్కడికక్కడే ఉన్న వస్తువులకు డిమాండ్ నెలకొని ధరలు అకాశన్నంటే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో పేదలు, మధ్యతరగతి ప్రజల జీవన గమనంపై తీవ్ర ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి లారీల సమ్మెను విరమింపజేయాల్సిన అవసరం ఉంది.
ప్రైవేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన డిమాండ్లు ఇవీ
-
కేంద్ర ప్రభుత్వం 2016 డిసెంబర్ 29న ఇచ్చిన 894 ఉత్తర్వుల ద్వారా రవాణా రంగంలో ఫిట్‌నెస్, డ్రైవింగ్ లైసెన్స్, లేటు చలానా ఫీజులు రోజుకు రూ.50 చొప్పున 500 రెట్లకుపైగా పెంచింది. తక్షణమే ఆ పెంపును ఉపసంహరించుకోవాలి.
-
2017 మార్చి 3వ తేదీన మూడో పార్టీ ఇన్సూరెన్స్‌ను 50 శాతం పెంచుతూ ఐఆర్‌డీఏ ద్వారా ప్రతిపాదనలు పెట్టింది. ఇది అమలు అయితే కార్మికులకు భద్రత లేకుండా పోతుందని, దాన్ని తక్షణమే విరమించుకోవాలని లారీ ఓనర్ల వాదన.
-
నిత్యం పెరుగుతున్న డీజిల్ రేట్లను తగ్గించాలి.
-
టోల్ గేట్ల నుంచి ఫీజు మినహాయింపులు ఇవ్వాలి.
-
లారీ డ్రైవర్ల భద్రతకు చర్యలు చేపట్టాలి.
-
ఆర్‌టీఏ అధికారుల నుంచి వేధింపులు లేకుండా చూడాలి.
న్యాయమైన డిమాండ్లను తీర్చాలి–పుల్లారెడ్డి, సీఐటీయూ నాయకులు
లారీ ఓనర్లు, డ్రైవర్లూ చేపట్టిన న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలి. సమ్మెలో ఉన్న కార్మికులపై ప్రభుత్వం కేసులు పెట్టడం దారుణం. పెంచిన ఆర్‌టీఏ చలానా, జరిమానా ఫీజులను ఉపసంహరించుకోవాలి. థర్డ్‌పార్టీ ఇన్సూరెన్స్‌ను 50 శాతం వరకు పెంచడం దారుణం. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె మరింత ఉద్ధృతమవుతుంది.