క(వ)ల చెదిరింది..
► మృత్యుపోరులో ఓడిన చిన్నారి
► ఏడేళ్ల క్రితం నాన్న.. ఐదురోజుల క్రితం అమ్మ..
► నేడు ఆరేళ్ల ఉమంత్.. మృత్యుఒడికి
► కవలల్లో ఒంటరైన ఉహాసిని
► కుటుంబాన్ని ఛిద్రం చేసిన రోడ్డు ప్రమాదం
కన్ను తెరవకముందే నాన్న పోయాడు. అయినా అమ్మే సర్వస్వం అనుకున్నారు ఆ కవలలు..కానీ విధి వెక్కిరించింది. ఐదు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో అమ్మ కూడా దూరమైంది. అమ్మతోపాటు గాయపడిన ఆరేళ్ల ఉమంత్ కూడా మత్యుపోరాటంలో గురువారం రాత్రి ఓడిపోయాడు. వేలూరుకు తరలించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆ కుటుంబంలో ఆరేళ్ల ఉహాసిని ఒంటరైంది. చంద్రగిరి మార్గంలో గత ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. కన్నీటి సంద్రంలోకి నెట్టివేసింది. మాటలకందని విషాదమిది..
తిరుపతి మెడికల్ : అనుకోని ప్రమాదం ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. తిరుపతి ఎంఆర్‌పల్లికి చెందిన చందన, మనోహర్ దంపతులకు ఉమంత్, ఉహాసిని కవల పిల్లలు. పంచాయతీ రాజ్ శాఖలో ఏఈగా పనిచేసిన మనోహర్ 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కారుణ్య కోటాలో భార్య చందనకు తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. దీంతో ఆమె కవల బిడ్డల్ని తండ్రి లేని లోటు తీర్చుతూ పెంచుతోంది. ఇంతలో మరో విషాదం ఆకుటుంబాన్ని తాకింది.
గత ఆదివారం ఏడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలతో కారులో వెళుతూ చంద్రగిరి వద్ద రోడ్డు ప్రమాదానికి గురై చందన ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో కవల పిల్లలు ఉమంత్, ఉహాసిని తీవ్రగాయాల పాలయ్యారు. ఉమంత్‌కు ఇదివరకే గుండెకు సంబంధించిన వ్యాధి ఉండటం, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం ఉమంత్(7)ని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ గురువారం ఉదయం వైద్యులు ఆపరేషన్‌ను నిర్వహించారు. ఆరోగ్యంగా కోలుకుంటాడనుకున్న ఉమంత్ పరిస్థి తి అకస్మాత్తుగా మారిపోయింది. గురువారం రాత్రి తుదిశ్వాస విడిచాడు.
ఈ సంఘటన చందన కుటుంబ సభ్యులను తీరని విషాదంలో ముంచింది. కవలల్లో ఒకరు మృతి చెందడంతో ఉహాసిని ఒంటరిగా మిగిలింది. ఎడమకాలు విరగడంతో రుయాలో చికిత్స పొందుతోంది. తల్లికి ఏమైందో, తనతో పాటు పుట్టిన అన్న ఎలా ఉన్నాడో కూడా తెలియని ఆ చిట్టి తల్లి అమ్మకావాలంటుంటే రుయా వైద్యులు కంటతడి పెడుతున్నారు.
విషయం దాచి పంటిబిగువున దుఃఖాన్ని అదిమిపెట్టుకుని వైద్యం చేస్తున్నారు. తన వద్దకు వచ్చిన వారిని అమ్మ కావాలంటూ ఆత్రుతగా అడగడం చూపరులను కంటతడిపెడుతోంది. అమ్మ వస్తుందని ఎదురుచూస్తోంది. కుటుంబం లో ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోవడం కుటుంబ సభ్యులను కలచివేస్తోంది. వేలూరు నుంచి ఉమంత్ మృతదేహాన్ని తిరుపతికి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఉమంత్ కోలుకోవాలని ఇక్కడ రెవెన్యూ అధికారులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కవల చిన్నారులను విషాదం విడదీయడం చందన కుటుంబ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. తుంటిఎముక, వెన్నెముక ఆపరేషన్ చేస్తుండగా గుండెపోటు రావడంతో బాలుడు మృతిచెందినట్టు రెవెన్యూ అసోసియేషన్ నాయకులు నరసింహులు నాయుడు తెలిపారు. కాగా ఉమంత్‌కు పుట్టుకతోనే గుండెసంబంధ వ్యాధి ఉంది. శస్త్రచికిత్స చేస్తే ప్రాణాపాయమని వైద్యులు చెప్పడంతో చందన వెనుకడుగు వేసింది.