నష్టాల్‌.. కష్టాల్‌... | losses for pacs | Sakshi
Sakshi News home page

నష్టాల్‌.. కష్టాల్‌...

Published Thu, Aug 11 2016 10:11 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

నష్టాల్లో ఉన్న పోరలి సొసైటీ

నష్టాల్లో ఉన్న పోరలి సొసైటీ

నష్టాలనుంచి కోలుకోని సొసైటీలు
వైద్యనాథ్‌ కమిషన్‌ సాయానికీ నోచుకోని వైనం
రుణమాఫీ మొత్తాలు జమకాని దుస్థితి
జాతీయ స్థాయి సాయానికి దూరం
లాభాల సొసైటీలకే జాతీయ కార్పొరేషన్‌ సాయం 
జిల్లాలో రెండింటికే అవకాశం
 
 
సాక్షి ప్రతినిధి, విజయనగరం : రుణమాఫీ వ్యవహారం సహకార సొసైటీలను నిలువునా ముంచింది. అసలే వైద్యనాథ్‌ కమిషన్‌ సాయం అందక... రైతులు తీసుకున్న రుణాలు కరువు కాటకాల కారణంగా సకాలంలో చెల్లించక... అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఆదుకోవాల్సిన సర్కారు వాటిపై కన్నెత్తయినా చూడట్లేదు. వీటి దుస్థితికి తోడు జాతీయ కార్పొరేషన్‌ సైతం లాభాల సైసైటీలకే సాయమందిస్తామన్న ప్రకటించడంతో జిల్లాలోని 93 సొసైటీలు ఆ అవకాశాన్ని కోల్పోయాయి. రుణమాఫీ మొత్తాలు జమయితే కొన్ని సొసైటీలైనా జాతీయ స్థాయి సాయానికి అర్హత సాధించగలిగి ఉండేవని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
జిల్లాలోని పీఏసీఎస్‌లు: 95
నష్టాల్లో ఉన్నవి: 93
లాభాల్లో ఉన్నవి: 2
సహకార సంఘాల నష్టాలు: రూ. 108.41కోట్లు  
 
రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల బలోపేతానికి దివంగత వైఎస్‌ హయాంలో ప్రత్యేక కషి జరిగింది. నష్టాల్లో ఉన్న సంఘాలను గట్టెక్కించేందుకు ఆయన వైద్యనాథ్‌ కమిషన్‌ వేశారు. రకరకాల కారణాలతో నష్టపోయి ఉన్న రైతుల నుంచి బకాయిలు వసూలు చేయలేని పరిస్థితుల్లో సహకార సంఘాలున్నాయని, వాటిని ప్రభుత్వమే ఆదుకోవాలని వైద్యనాథ్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు సంఘాలను పరిపుష్టి చేసేందుకు జిల్లాకు రూ. 66.40కోట్ల ఆర్థిక సాయం అందించారు. అటు తరువాత సొసైటీలకు ఆ సాయం చేరలేదు. అప్పటికే ఉన్న సొసైటీల రుణ బకాయిల కింద జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) దాదాపు సర్ధుబాటు చేసుకుంది. సంఘాలకు వెళ్లింది స్వల్పమే. దీంతో సహకార సంఘాలు లావాదేవీలను అభివద్ధి చేసుకోలేకపోయాయి. ఏటా డీసీసీబీ చేయాల్సిన ఫైనాన్స్‌ కూడా సక్రమంగా జరగలేదు. సొసైటీలకిచ్చిన గత రుణాలనే రీలోనింగ్‌గా మార్చుకుంటోంది.
 
 
అసలేం జరగాలంటే...
ఆప్కాబ్‌ నుంచి డీసీసీబీకి సాయం వస్తుంది. దాంట్లోంచి సొసైటీల వారీగా డీసీసీబీ రుణసాయం చేయాలి. సొసైటీలకొచ్చిన రుణసాయం నుంచి రైతులకు రుణాలు ఇవ్వాలి. రుణ బకాయిలు వసూలు చేసి తిరిగి డీసీసీబీకి సొసైటీలు చెల్లించాలి. ఇదంతా ఒక సైక్లింగ్‌ విధానం. కానీ, లావాదేవీలు సక్రమంగా జరగలేదు. గతేడాది రూ. 103.11కోట్లు సొసైటీలకు రుణ సాయం చేసినట్టు డీసీసీబీ లెక్కలు చూపిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే వాటిలో అత్యధికం గతంలో ఇచ్చిన రుణాలను రీలోనింగ్‌గా చూపించి, సర్దుబాటు చేసుకుంది. అంటే, ఏళ్ల తరబడి రైతులు బకాయిలు చెల్లించకపోవడం... సొసైటీలకు కొత్తగా ఫైనాన్స్‌ అందకపోవడంతో అవి ఆర్థిక పురోగతి సాధించలేకపోయాయి. ఇంతలో సీఎం చంద్రబాబు నాయుడు రుణమాఫీ ప్రకటించారు. ఆ మొత్తాలు పూర్తిగా వచ్చేసుంటే నష్టాలనుంచి సంఘాలు బయటపడేవి. ప్రభుత్వం చేసిన అరకొర రుణమాఫీతో ఎక్కడికక్కడ బకాయిలు పేరుకుపోయాయి. ప్రభుత్వం చేసిన రుణమాఫీ ప్రకటన మేరకు రైతులు కూడా బకాయిలు చెల్లించడం లేదు. దీంతో సహకార సంఘాల నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. రూ. 108.41కోట్ల మేర నష్టాలున్నాయంటే ఈ సంఘాలు ఎప్పటికి గట్టెక్కుతాయో దేవుడికే ఎరుక.
 
 
జాతీయ సాయానికి అనర్హత
జిల్లాలో లాభాల్లో ఉన్న సహకార సంఘాలకే సాయమందిస్తామని జాతీయ సహకార అభివద్ధి కార్పొరేషన్‌(ఎన్‌సీడీసీ) ముందుకొచ్చింది. మూడేళ్ల పాటు వరుసగా లాభాలొచ్చిన సంఘాల జాబితాను పంపిస్తే వారికి అన్ని రకాలుగా సాయం చేస్తామని సూచించింది. అయితే ఎన్‌సీడీసీ ఇచ్చిన అవకాశానికి జిల్లాలో రెండే సొసైటీలు అర్హత సాధించాయి. జిల్లాలో 95 సహకార సంఘాలుండగా వాటిలో భోగాపురం మండలం పోలిపల్లి, గుర్ల మండలం కెల్ల సొసైటీలు మాత్రమే లాభాలు సాధించినట్టుగా నివేదికలు స్పష్టం చేశాయి. మిగతా 93సొసైటీలు నష్టాల్లోనే ఉన్నాయి. ఎరువులు, విత్తనాల అమ్మకాలు, «ధాన్యం కొనుగోలు తదితర సేవల ద్వారా సొసైటీల్లో లావాదేవీలు జరుగుతున్నా అవి నష్టాల నుంచి గట్టెక్కించలేకపోతున్నాయి. కారణాలేమైనప్పటికీ నష్టాల కారణంగా జాతీయ సహకార అభివద్ధి కార్పొరేషన్‌ నుంచి రావల్సిన అవకాశాలను కోల్పోవాల్సి వచ్చింది. ఏటా ఇదే పరిస్థితిని సొసైటీలు ఎదుర్కొంటున్నాయి. ఈ దుస్థితి నుంచి గట్టెక్కాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక సాయమందాలి. పూర్తిగా రుణమాఫీ చేసినట్టయితే రైతుల రుణ బకాయిల నుంచి గట్టెక్కి నికర ఆదాయంలోకి వస్తాయి. అప్పుడే జాతీయ సాయానికి అర్హత సాధించగలవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement