కర్నూలు: జిల్లాలో నాటుసారా, బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయాలపై పోలీసు ప్రజాదర్బార్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పుష్కరఘాట్ల దగ్గర కొండ చెరియలు విరిగి పడటంతో ఎస్పీ ఆకె రవికష్ణ శ్రీశైల పర్యటనకు వెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు స్పెషల్ బ్రాంచి డీఎస్పీ బాబు ప్రసాదు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం పోలీసు ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. స్పెషల్ బ్రాంచి సీఐలు శ్రీనివాసులు, దస్తగిరి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి నాటుసారా తయారీ స్థావరాలపై పక్కా ఆధారాలతో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. బేతంచెర్ల, బనగానపల్లె ప్రాంతాల్లో హోటళ్లలో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేశారు. బెల్టు దుకాణాలు, నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. కర్నూలు నగరంలోని మున్సిపల్ ఆఫీసు సమీపంలోని బేకరి షాపు ఎదుట, గడియారం ఆస్పత్రి నుండి పెద్ద మార్కెట్ వరకు రోడ్డుకు ఇరువైపు ట్రాలీ ఆటోలు నిలపడతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని ప్రజలు ఫిర్యాదు చేశారు. తన భర్త మద్యానికి బానిసై తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, కర్నూలు నగరానికి చెందిన శిరీష ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఎస్పీ, ప్రజాదర్బార్ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు.