లాటరీ తెచ్చిన తంటా..
ఒకే నెంబర్ ఇద్దరికి?
గురజాల(గుంటూరు): గురజాలలో లాటరీ వ్యాపారం నిర్వాహకులు, కొనుగోలుదారుల మధ్య పెద్ద తంటా తెచ్చినట్లు సమాచారం. నిర్వాహకులు ఒకే నంబర్‌ను ఇద్దరికీ ఇవ్వడంతో సమస్య ఎదురైంది. పైగా అదే నంబర్‌కు సుమారు రూ.3 లక్షలకుపైగా లాటరీ తగిలినట్లు తెలుస్తోంది. విజేతలు మాత్రం ఎవరికి వారే ప్రైజ్ మనీ తనకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలీక నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. బుధవారం రాత్రి వరకు సమస్య ఓ కొలిక్కి రాలేదు. కాగా, పల్నాడు ప్రాంతంలో లాటరీ టిక్కెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో లాటరీలపై నిషేధం ఉండటంతో నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తున్నారు.
సెల్‌ఫోన్ ద్వారా వచ్చిన లాటరీ నెంబర్‌ను నిర్వాహకులు కొనుగోలుదారులకు ఒక కాగితంపై రాసి ఇస్తున్నారు. సాయంత్రం సమయంలో ఫలితాలు వెలువడుతుంటాయి. విజేతలకు నరసరావుపేటలో నగదు అందచేస్తుంటారు. పోలీస్ సబ్ డివిజన్ కేంద్రమైన గురజాలలో లాటరీ వ్యాపారం సులభంగా, వేగంగా విస్తరిస్తోంది. ఏడాది కాలంలో సుమారు 10 మంది లక్షల్లో లాటరీ ద్వారా లబ్ధి పొందినట్లు ప్రచారం ఉంది. ఈజీ మనీ కావడంతో చిరు వ్యాపారులు కూడా బాగా ఆకర్షితులవుతున్నారు. లాటరీ తగిలినవాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, సొమ్ము పోగొట్టుకున్న వాళ్లు మాత్రం వెంటనే పోలీసులు రంగంలోకి దిగి లాటరీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.