same number
-
వాహనం అమ్మేసినా...నంబర్ ఉంచేసుకోవచ్చు!
అహ్మదాబాద్: ముచ్చటపడి కారు, బండి (ద్విచక్ర వాహనం) కొనుక్కుంటాం. దానికి ఫ్యాన్సీ నంబరు ఉండాలనో, సంఖ్యాశాస్త్రం ప్రకారం తమకు అచ్చివచ్చే నంబరు ఉండాలనో, మతపరమైన విశ్వాసాలతోనో, సెంటిమెంటుతోనో ప్రభుత్వం నిర్ణయించిన ధర కట్టి వాటిని సొంతం చేసుకుంటాం. ఆల్స్ (1111, 2222...)కు అయితే మంచి క్రేజ్. అదే 9, 99, 999... ఆల్ నైన్స్ అయితే వేలంలో ఎంతకు అమ్ముడవుతాయో ఎవరూ ఊహించలేరు. కోటీశ్వరులు, సెలబ్రిటీలు లక్షలు పోసి నంబరును సొంతం చేసుకుంటారు. సరే.. కొన్నేళ్లు పోయాక వాహనం పాతబడుతుంది. మరోటి కొంటారు. మళ్లీ దానికి అదే నంబరు ఉండాలనుకునే వారు ఎంతోమంది ఉంటారు. ఎంత ఖర్చయినా వెనుకాడకుండా వేరే సిరీస్‌లో సేమ్ నంబర్ తీసుకుంటారు. అలాకాకుండా మన పాత నంబర్‌ను మనమే ఉంచుకోగలిగితే! చాలా బాగుంటుంది కదూ! గుజరాత్ ప్రభుత్వం సోమవారం ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్లు ప్రకటించింది. పాత వాహనాన్ని అమ్మివేసినా, మూలకుపడ్డాక (జీవితకాలం తీరిపోయాక) తుక్కుకింద తీసివేసినా... దాని తాలూకు నంబర్‌ను సదరు యజమాని కొనుగోలు చేసే కొత్త వాహనానికి బదిలీ చేసుకోవచ్చని గుజరాత్ రవాణా శాఖ మంత్రి పూర్ణేష్ మోదీ వెల్లడించారు. ఈ విధానం ఢిల్లీ, యూపీ, పశ్చిమ బెంగాల్లో అమల్లో ఉంది. గరిష్టంగా రూ.40 వేలు కడితే చాలు తమపేరిట కేటాయింపు ఉన్న నంబర్లను కొత్తగా కొన్న వాహనాలకే బదిలీ చేసుకోవచ్చని, సెకండ్ హ్యాండ్ వెహికిల్స్‌కు మళ్లించానికి వీల్లేదని చెప్పారు. పాత నంబరు కారుకు ఉంటే దాన్ని ఇంకో కారుకే బదలాయించాలి తప్పితే ద్విచక్ర వాహనానికి మార్చడానికి వీల్లేదు. కనీసం ఏడాది పాటు తమవద్ద వాహనం ఉంటేనే దాని నంబరును మార్చుకోవడానికి అర్హులవుతారు. గుజరాత్లో ద్విచక్ర వాహనాలకు గోల్డెన్ కేటగిరీ ఫ్యాన్సీ నంబర్లకైతే రూ. 8 వేలు, సిల్వర్ కేటగిరీ నంబర్లకు రూ.3,500, ఇతర నంబర్లకు రూ. 2,000 చెల్లించాలి. అదే కార్లు, ఇతర ఫోర్ వీలర్లకయితే గోల్డెన్ కేటగిరీ నంబర్లకు రూ. 40 వేలు, సిల్వర్‌కు రూ. 15 వేలు, ఇతర నంబర్లకు రూ. 8 వేలు చెల్లిస్తే పాత నంబరును ఉంచేసుకోవచ్చు. -
ఒకే పేరున్న ఇద్దరికి ఒకే అకౌంట్ నంబర్
భిండ్: ఒకే పేరున్న ఇద్దరికి ఒకే ఖాతా నంబర్ ఇచ్చిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వాకమిది. ఆ ఇద్దరిలో ఒకరు డబ్బులు డిపాజిట్ చేస్తుండగా, మరొకరు వాటిని విత్‌డ్రా చేసి వాడుకున్నాడు. చివరికి విషయం కనుక్కొని ప్రశ్నించగా.. ‘మోదీజీ(ప్రధాని మోదీ)నే నా అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడనుకున్నా’అని విత్ డ్రా చేసుకున్న వ్యక్తి జవాబివ్వడంతో బ్యాంక్ అధికారులు అవాక్కయ్యారు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. హుకుమ్ సింగ్ అనే పేరున్న ఇద్దరికి ఒకే అకౌంట్ నెంబర్‌ను ఎస్బీఐ ఆలంపూర్ బ్రాంచ్ కేటాయించింది. రురాయి గ్రామానికి చెందిన హుకుంసింగ్.. స్థలం కొనుక్కునేందుకు డబ్బులు జమ చేయాలనే ఉద్దేశంతో రెగ్యులర్‌గా అకౌంట్లో డబ్బులు వేసేవాడు. వాటిని రవుని గ్రామానికి చెందిన హుకుంసింగ్ విత్ డ్రా చేసుకుని వాడుకునేవాడు. అలా దాదాపు రూ. 89 వేల రూపాయలను విత్ డ్రా చేసుకున్నాడు. డిపాజిట్ చేసిన డబ్బులు తీసుకుందామని బ్యాంక్‌కు వెళ్లిన హుకుంసింగ్‌కు తన అకౌంట్లో ఉండాల్సిన డబ్బులు విత్ డ్రా అయిన విషయం తెలిసింది. మేనేజర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయమై విత్ డ్రా చేసిన హుకుంసింగ్‌ను ప్రశ్నిస్తే.. ‘మోదీజీ ఇస్తున్నాడనుకున్నా. అందుకే వాడుకున్నా’అని జవాబిచ్చాడు. -
బైకులే వేరు నంబరు ఒక్కటే
విశాఖపట్నం, తగరపువలస: వాహనదారులూ జర జాగ్రత్త. ఇలాంటివి మీకు ఎదురుకావొచ్చు. విషయం ఏమిటంటే...జీవీఎంసీ భీమిలి జోన్ 27వ వార్డు సంగివలస అల్లూరి సీతారామరాజు కాలనీకి చెందిన కొయ్యాన శ్రావణ్‌కుమార్ తన ఏపీ 31 ఈజె 2321 నంబరు గల ద్విచక్రవాహనం సీబీ యూనీకార్న్పై ఇటీవల నగరంలో హెల్మెట్ లేకుండా వస్తూ ట్రాఫిక్ పోలీసులకు చిక్కినట్టే చిక్కి జారిపోయాడు. పోలీసులు నంబర్ నోట్ చేసుకుని అపరాధ రుసుం చెల్లించాలని శ్రావణ్‌కుమార్ ఇంటికి ఇ–చలానా పంపించారు. అందులో ప్రస్తుత జరిమానాతో పాటు గతంలో శ్రీకాకుళంలో చెల్లించిన జరిమానా మరో రెండు బకాయిల అపరాధ రుసుములు చూపించారు. శ్రావణ్ గాని అతని తండ్రి కృష్ణ గాని అంతకు ముందెన్నడూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టుగాని, అర్హత పత్రాలు లేకుండా గాని అటు రవాణా శాఖ ఇటు ట్రాఫిక్ పోలీసులకు చిక్కింది లేదు. అయినప్పటికీ బకాయిలు చూపించడంతో వీటిని ఆన్లైన్లో చూసేసరికి తమ వాహనం నంబరే వేర్వేరు ద్విచక్రవాహనాలకు కలిగి ఉండటంతో ఖంగు తిన్నారు. దీనిపై రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు కూడా ఆశ్చర్యపోయారు. రవాణా శాఖ ఒకే నంబరును అనేక మందికి జారీ చేసిందా లేదా వేర్వేరు వ్యక్తులు అదే నంబరును దొంగదారిన వినియోగిస్తున్నారా అని తలలు పట్టుకున్నారు. దీనిపై విచారణ జరిపిస్తామని వాహనదారుడు శ్రావణ్ కుమార్‌కు హామీ ఇచ్చారు. -
ఒకే నంబర్.. రెండు కార్లు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం, పెనుకొండ: పెనుకొండ ప్రాంతంలో ఒకే నంబరు ప్లేటుతో రెండు కార్లు తిరుగుతున్నాయి. పట్టణానికి చెందిన సురేష్‌బాబు అనే వ్యక్తి ఏపీ02 ఆర్ 8118 నంబరు గల సిల్వర్ రంగు ఇన్నోవా కారు కొనుగోలు చేశాడు. మరో ప్రాంతంలో బిస్కట్ రంగు ఇన్నోవా వాహనాన్ని కొనుగోలు చేశాడు. అయితే రెండింటికీ ఒకే నంబరు ప్లేటు తలిగించుకుని దర్జాగా బాడుగకు తిప్పుతున్నాడు. పన్నులు ఎగ్గొట్టడానికి ఈ విధంగా చేసినట్లు తెలుస్తోంది. -
ఆ కుటుంబంలో అందరిదీ 111 ఏళ్ళ వయసే!
పెద్దతిప్పసముద్రం: వారి పొరపాటు వీరికి గ్రహపాటుగా మారింది. ఓ కుటుంబానికి చెందిన రేషన్ కార్డులో కుటుంబ యజమాని, భార్య, కుమారుడికి అందరికీ ఒకేలా 111 ఏళ్ళ వయసు నమోదు అయి ఉంది. ఇది ఎలా నమోదైంది అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఆదాయ ధ్రువీకరణ, పుట్టిన తేదీ ధ్రువపత్రాల కోసం వెళితే రేషన్ కార్డులో పేర్కొన్న వయసు అడ్డొస్తోంది. దీంతో కార్డులో వయసును మార్చుకునేందుకు ఏం చేయాలో దిక్కుతోచక ఆ కుటుంబీకులు సతమతమవుతున్నారు. చిత్తూరుజిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం బూర్లపల్లి పంచాయతీ పరిధిలోని యంపార్లపల్లికి చెందిన గుట్టపాళ్యం వెంకట్రమణ పేరిట డబ్ల్యూఎపి 1004007ఏ0166 నంబర్ గల రేషన్ కార్డు ఉంది. వ్యవసాయ పనులే ఈయన జీవనాధారం. వాస్తవంగా వెంకట్రమణకు 55 ఏళ్లు, భార్య అమరమ్మకు 45ఏళ్లు, కుమారుడు మురళీధర్ రెడ్డికి 18 ఏళ్ళ వయసు. మురళీధర్‌రెడ్డి పుత్తూరులోని ఓ కాలేజీలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నెల క్రితం అతనికి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం అవసరం వచ్చింది. కాలేజీ అధికారులు వీరి రేషన్ కార్డు నంబర్‌ను ఆన్లైన్లో క్లిక్ చేయగా ఇతనికి 111 ఏళ్లు, అలాగే అతని తల్లిదండ్రులకూ 111 ఏళ్ళ వయసు నమోదై ఉండటాన్ని గమనించి అవాక్కయ్యారు. దీంతో కార్డులోని వయసును సవరించాలంటూ ఆ కుటుంబీకులు మీ-సేవ కేంద్రానికి వెళ్లారు. అయితే వయసు మార్పు చేసే ఆప్షన్ ఏదీ లేదని మీ-సేవ నిర్వాహకులు స్పష్టం చేశారని వెంకట్రమణ వాపోయాడు. అధికారుల తప్పిదాల కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ఎక్కడికి వెళ్ళి సవరణ చేయించుకోవాలో పాలుపోవడం లేదని కార్డుదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. -
లాటరీ తెచ్చిన తంటా..
ఒకే నెంబర్ ఇద్దరికి? గురజాల(గుంటూరు): గురజాలలో లాటరీ వ్యాపారం నిర్వాహకులు, కొనుగోలుదారుల మధ్య పెద్ద తంటా తెచ్చినట్లు సమాచారం. నిర్వాహకులు ఒకే నంబర్‌ను ఇద్దరికీ ఇవ్వడంతో సమస్య ఎదురైంది. పైగా అదే నంబర్‌కు సుమారు రూ.3 లక్షలకుపైగా లాటరీ తగిలినట్లు తెలుస్తోంది. విజేతలు మాత్రం ఎవరికి వారే ప్రైజ్ మనీ తనకే ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలీక నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. బుధవారం రాత్రి వరకు సమస్య ఓ కొలిక్కి రాలేదు. కాగా, పల్నాడు ప్రాంతంలో లాటరీ టిక్కెట్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రంలో లాటరీలపై నిషేధం ఉండటంతో నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తున్నారు. సెల్‌ఫోన్ ద్వారా వచ్చిన లాటరీ నెంబర్‌ను నిర్వాహకులు కొనుగోలుదారులకు ఒక కాగితంపై రాసి ఇస్తున్నారు. సాయంత్రం సమయంలో ఫలితాలు వెలువడుతుంటాయి. విజేతలకు నరసరావుపేటలో నగదు అందచేస్తుంటారు. పోలీస్ సబ్ డివిజన్ కేంద్రమైన గురజాలలో లాటరీ వ్యాపారం సులభంగా, వేగంగా విస్తరిస్తోంది. ఏడాది కాలంలో సుమారు 10 మంది లక్షల్లో లాటరీ ద్వారా లబ్ధి పొందినట్లు ప్రచారం ఉంది. ఈజీ మనీ కావడంతో చిరు వ్యాపారులు కూడా బాగా ఆకర్షితులవుతున్నారు. లాటరీ తగిలినవాళ్లు సంబరాలు చేసుకుంటుండగా, సొమ్ము పోగొట్టుకున్న వాళ్లు మాత్రం వెంటనే పోలీసులు రంగంలోకి దిగి లాటరీ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.