అహ్మదాబాద్: ముచ్చటపడి కారు, బండి (ద్విచక్ర వాహనం) కొనుక్కుంటాం. దానికి ఫ్యాన్సీ నంబరు ఉండాలనో, సంఖ్యాశాస్త్రం ప్రకారం తమకు అచ్చివచ్చే నంబరు ఉండాలనో, మతపరమైన విశ్వాసాలతోనో, సెంటిమెంటుతోనో ప్రభుత్వం నిర్ణయించిన ధర కట్టి వాటిని సొంతం చేసుకుంటాం. ఆల్స్ (1111, 2222...)కు అయితే మంచి క్రేజ్. అదే 9, 99, 999... ఆల్ నైన్స్ అయితే వేలంలో ఎంతకు అమ్ముడవుతాయో ఎవరూ ఊహించలేరు. కోటీశ్వరులు, సెలబ్రిటీలు లక్షలు పోసి నంబరును సొంతం చేసుకుంటారు. సరే.. కొన్నేళ్లు పోయాక వాహనం పాతబడుతుంది. మరోటి కొంటారు. మళ్లీ దానికి అదే నంబరు ఉండాలనుకునే వారు ఎంతోమంది ఉంటారు.
ఎంత ఖర్చయినా వెనుకాడకుండా వేరే సిరీస్‌లో సేమ్ నంబర్ తీసుకుంటారు. అలాకాకుండా మన పాత నంబర్‌ను మనమే ఉంచుకోగలిగితే! చాలా బాగుంటుంది కదూ! గుజరాత్ ప్రభుత్వం సోమవారం ఈ వెసులుబాటును కల్పిస్తున్నట్లు ప్రకటించింది. పాత వాహనాన్ని అమ్మివేసినా, మూలకుపడ్డాక (జీవితకాలం తీరిపోయాక) తుక్కుకింద తీసివేసినా... దాని తాలూకు నంబర్‌ను సదరు యజమాని కొనుగోలు చేసే కొత్త వాహనానికి బదిలీ చేసుకోవచ్చని గుజరాత్ రవాణా శాఖ మంత్రి పూర్ణేష్ మోదీ వెల్లడించారు. ఈ విధానం ఢిల్లీ, యూపీ, పశ్చిమ బెంగాల్‌లో అమల్లో ఉంది.
గరిష్టంగా రూ.40 వేలు కడితే చాలు
తమపేరిట కేటాయింపు ఉన్న నంబర్లను కొత్తగా కొన్న వాహనాలకే బదిలీ చేసుకోవచ్చని, సెకండ్ హ్యాండ్ వెహికిల్స్‌కు మళ్లించానికి వీల్లేదని చెప్పారు. పాత నంబరు కారుకు ఉంటే దాన్ని ఇంకో కారుకే బదలాయించాలి తప్పితే ద్విచక్ర వాహనానికి మార్చడానికి వీల్లేదు. కనీసం ఏడాది పాటు తమవద్ద వాహనం ఉంటేనే దాని నంబరును మార్చుకోవడానికి అర్హులవుతారు. గుజరాత్‌లో ద్విచక్ర వాహనాలకు గోల్డెన్ కేటగిరీ ఫ్యాన్సీ నంబర్లకైతే రూ. 8 వేలు, సిల్వర్ కేటగిరీ నంబర్లకు రూ.3,500, ఇతర నంబర్లకు రూ. 2,000 చెల్లించాలి. అదే కార్లు, ఇతర ఫోర్ వీలర్లకయితే గోల్డెన్ కేటగిరీ నంబర్లకు రూ. 40 వేలు, సిల్వర్‌కు రూ. 15 వేలు, ఇతర నంబర్లకు రూ. 8 వేలు చెల్లిస్తే పాత నంబరును ఉంచేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment