మాయమాటలు చెప్పి ...
పెళ్లి చేసుకోమని ప్రియురాలి మౌనదీక్ష
సుందరాడ(తెర్లాం రూరల్): ప్రేమించానని.. పెళ్లి చేసుకుంటానని పెద్దల సమక్షంలో ఒప్పుకొని ముఖం చాటేశాడొక ప్రేమికుడు. దీంతో దగాపడిన ప్రేమికురాలు సుందరాడలోని ప్రేమికుని ఇంటి ముందు బుధవారం మౌనదీక్ష ప్రారంభించింది. బాధితురాలు పద్మ విలేకరులకు అందించిన వివరాలివి. సుందరాడ గ్రామానికి చెందిన ముత్తా పెదలక్ష్మణ, సీతల కుమార్తె పద్మ(19) అదే గ్రామానికి చెందిన సిగిరికోట గణపతి, కృష్ణవేణిల కుమారుడు శివాజీతో ఏడాదికి పైగా ప్రేమ వ్యవహారం నడిచింది. కానీ పద్మకు 2015లో పార్వతీపురం మండలం అడ్డాపుశీల గ్రామానికి చెందిన శంకర్‌తో తల్లిదండ్రులు వివాహం చేశారు.
పద్మ, శంకర్‌లు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ లో హాయిగా కాపురం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో శివాజీ హైదరాబాద్ వెళ్లి పద్మకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. ఇది భర్త శంకర్‌కు తెలియడంతో ఉభయుల తల్లిదండ్రులు, రెండు గ్రామాల పెద్దల ముందు సమస్య పెట్టాడు. శివాజీని ఇరు గ్రామాల పెద్దలు నిలదీయగా పద్మ అంటే తనకు ఇష్టమని, భర్తతో విడాకులు తీసుకుంటే పెళ్లి చేసుకుంటానన్నాడు.
దీంతో ఇరు గ్రామాల పెద్దలు పద్మ, శంకర్‌లకు విడాకుల అగ్రిమెంట్లు రాయించి పద్మను సుందరాడకు తీసుకొచ్చారు. సుందరాడ వచ్చాక శివాజీ పెళ్లికి నిరాకరిస్తున్నాడు. తనకు జరిగిన అన్యాయంపై పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టనని, శివాజీ పెళ్లి చేసుకొనేంత వరకు అతని ఇంటి ముందు నుంచి కదిలే ప్రసక్తి లేదని పద్మ స్పష్టం చేసింది. ఆమె చెప్పిన విషయాలన్నీ వాస్తవమని గ్రామస్తులు చెప్పారు. పద్మ ప్రేమ వ్యవహారంపై ప్రియుడు శివాజీని ప్రశ్నించగా తనకెలాంటి సంబంధం లేదని, కావాలనే నిందలు వేస్తున్నారన్నాడు. పద్మ, శివాజీ ప్రేమ వ్యవహారంపై ఫిర్యాదు అంద లేదని తెర్లాం ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. శివాజీపై కేసు నమోదు చేయవద్దని, అతనితో పెళ్లి చేయించమని పద్మ కోరిందన్నారు. సమస్యపై గ్రామపెద్దలతో మాట్లాడుకోవాలని సూచించినట్టు తెలిపారు.
నా కుమార్తెకు న్యాయం చేయండి
నా కుమార్తె ప్రేమించిన శివాజీతో వివాహం చేయించి న్యాయం చేయండి. కుమార్తెకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే శివాజీ వే ధించాడు. భర్తతో తెగతెంపులు చేయించాడు. పెళ్లి చేసుకుంటానని గ్రామ పెద్దల ఎదుట చెప్పి ఇప్పుడు కాదనడం ఎంతవరకు న్యాయం. - ముత్తా పెదలక్ష్మణ