విచిత్ర బంధం
ప్రేమను చంపుకోలేక తనువు చాలించిన ప్రేమికులు
తిరుపతి హోటల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య
వరంగల్ అబ్బాయి.. వల్లూరు అమ్మాయి
ఆచంట/సాక్షి ప్రతినిధి, తిరుపతి :
వారిది పెద్దలు కలిపిన బంధం కాదు. వారికి వారే పెనవేసుకున్న అనురాగ బంధం. ప్రాంతాలు.. కులాలు వేరైనా మనసులు కలిశాయి. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని కలలు కన్నారు. కానీ.. సమాజానికి భయపడ్డారు. ఇదేమని ఎవరైనా అడిగితే ఏం బదులు చెప్పాలో తెలియక కలవరపడ్డారు. కలిసి బతకలేమన్న భీతితో చివరకు తనువు చాలించారు. వీడలేని బంధం మాదంటూ ఒకేసారి విగతజీవులయ్యారు. ఆచంట మండలం వల్లూరు గ్రామ పరిధిలోని బెజవాడ వారిపాలెంకు చెందిన దేవల మౌనిక, వరంగల్ జిల్లా మోదుగులగూడెం మండలం పానరస గ్రామానికి చెందిన తేజావత్ రంజిత్‌కుమార్ (31) తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల హోటల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. తిరుపతి ఈస్ట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆచంట మండలం బెజవాడవారి పాలెం గ్రామానికి చెందిన దేవల పాపారావు, శ్రీదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె మౌనిక. మూడునెలల కిందటే ఈమెకు దగ్గర బంధువుతో పెళ్లైంది. ఈ పెళ్లికి ముందే మౌనికకు రంజిత్‌తో పరిచయం ఉంది. అతడు వరంగల్ జిల్లా అటవీ శాఖలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వివాహం కాగా.. ఓ కుమార్తె ఉంది. కొన్నాళ్ల క్రితం అతని భార్య చనిపోయింది. కాగా, మౌనికకు వరంగల్ ప్రాంతంలో బంధువులు ఉన్నారు. ఆమె తరచూ వారింటికి వెళ్తుండేది. వరంగల్‌కు రాకపోకలు సాగించే క్రమంలో మౌనికకు రంజిత్‌తో పరిచయమైంది. అది ప్రేమగా మారింది. అయితే, అప్పటికే వివాహమై కుమార్తెను కలిగి ఉన్న రంజిత్‌తో వివాహం కష్టమని నిర్ణయించుకున్న మౌనిక తల్లిదండ్రులకు ఎదురు చెప్పలేక పెద్దలు చేసిన పెళ్లికి తలొంచింది. రంజిత్‌ను మాత్రం మర్చిపోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే జనవరి 22న ఇంటినుంచి పారిపోయింది. అదే నెల 29వతేది వరకు ఆమె భర్త, తల్లిదండ్రులు గాలించినా కనబడకపోవడంతో వారి ఫిర్యాదు మేరకు ఆచంట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అనంతరం రంజిత్, మౌనిక ఈనెల 13న తిరుపతి చేరుకుని ఆర్టీసి బస్టాండ్ ఎదురుగా గల ఓ ప్రముఖ హోటల్‌లో భార్యాభర్తలమని చెప్పి గదిని అద్దెకు తీసుకున్నారు. అప్పటినుంచి తిరుమల, తిరుపతిలోని ఆలయాలను సందర్శించారు. ఇదిలావుంటే.. శుక్రవారం మధ్యాహ్నం రూమ్‌ను శుభ్రపరిచేందుకు రూమ్‌బాయ్ కాలింగ్ బెల్ కొట్టాడు. ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో హోటల్ మేనేజర్‌కు సమాచారం తెలపగా అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈస్టు సీఐ రాంకిషోర్, ఎస్సై అక్కడకు చేరుకుని గది తలుపును పగులగొట్టి లోపలకు వెళ్లి చూడగా వీరిద్దరు ఒకే ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. రంజిత్ ప్లాస్టిక్ వైరుతో, మైనిక చున్నీతో ఉరివేసుకున్నారు. సెల్‌ఫోన్ ఆధారంగా ఇరువురి ఆచూకీ తెలుసుకున్న పోలీసులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
క్లాస్‌కు వెళ్లొస్తానని..
మౌనిక పదో తరగది ప్రైవేటుగా చదువుతోంది. తూర్పుగోదావరి జిల్లా గన్నవరం మండలం వాడ్రేవుపల్లికి చెందిన దేవళ్ల శ్రీకాంత్‌కు ఇచ్చి మూడు నెలల క్రితమే మౌనికకు వివాహం జరిపించారు. శ్రీకాంత్ ఆమెకు వరుసకు బావ అవుతాడు. వివాహమైన నాటినుంచి మౌనిక ఆచంటలోని ఆమె అమ్మమ్మ ఇంటివద్ద ఉంటూ ప్రైవేటుగా పదో తరగతి చదువుకుంటోంది. జనవరి 22వ తేదీన ప్రైవేటు క్లాసుకు వెళ్లి వస్తానని చెప్పి బమటకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు.
సెల్ఫీ పంపింది
ఇంటినుంచి వెళ్లిపోయిన మౌనిక తాను ప్రేమించిన రంజిత్‌తో కలిసి సుఖంగా ఉన్నానంటూ వారిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీని ఇటీవల బంధువులకు వాట్సాప్ ద్వారా పంపించినట్టు సమాచారం. అంతలోనే వారికి ఏ కష్టమొచ్చిందో తిరుపతిలో ప్రేమికునితో కలిసి ఉరేసుకుని చనిపోయింది. కుమార్తె ఏదో రోజు తిరిగి వస్తుందని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, బంధువులు ఆమె మరణించిందన్న విషయం తెలిసి తల్లడిల్లిపోయారు. శుక్రవారం రాత్రి హుటాహుటిన తిరుపతికి పయనమై వెళ్లారు.