ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నం
పుణ్యగిరి సమీపంలో ఘటన
కుటుంబ సభ్యులకు ఫోన్‌ద్వారా సమాచారం
మిత్రుల సాయంతో ఆస్పత్రిలో చేరిక
శృంగవరపుకోట : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామనుకున్నారు. పెద్దలు అంగీకరించలేదు. ఇక కలసి బతకలేమనుకుని కలిసే చావాలనుకున్నారు. అంతే... క్రిమి సంహారక మందులు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అయితే సమాచారం తెలుసుకుని కొందరు వారిని ఆస్పత్రిలో చేర్చడంతో ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆస్పత్రి వర్గాలు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట పట్టణంలోని శ్రీనివాసకాలనీలో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థిని మేడపాటి సత్యవతి, సెంటరింగ్ పనులు చేసే కోటపల్లి ప్రసాద్ ఉరఫ్ స్వామి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దల అంగీకారం లభించకపోవడంతో ఆత్మహత్యకు సిద్ధపడ్డారు. ఇద్దరూ పుణ్యగిరి ప్రాంతానికి వెళ్లి క్రిమిసంహారక మందు సేవించారు. వాంతులు చేసుకుని అపస్మారకస్థితికి చేరుకున్న వీరిద్దరినీ 4గంటల సమయంలో కాలనీ యువకులు బైక్‌లపై ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. డాక్టర్ శ్యామల ప్రాధమిక చికిత్స చేసి పరిస్థితి చేయిదాటడంతో మెరుగైన వైద్యంకోసం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేస్తున్నట్టు హెచ్‌సీ వెంకటరావు చెప్పారు.
చివరి నిమిషంలో ఇళ్లకు సమాచారం
స్థానికుల కథనం ప్రకారం సత్యవతి తన తండ్రికి ఫోన్ చేసి ‘నేను వైజాగ్ వెళ్లిపోయా, చనిపోతున్నా నా కోసం వెదకొద్దు’ అంటూ చెప్పింది. స్వామి తన యజమాని ధన భార్యకు ఫోన్ చేసి ‘అక్కా నేను విశాఖలో మా అక్క ఇంటికి వెళ్లాను. రెండు రోజులు పనికి రాను’ అంటూ తొలుత చెప్పాడు. మళ్లీ ఫోన్ చేసి ‘మేం పుణ్యగిరి కొండపై ఉన్నాం. పురుగుల మందు తాగేస్తున్నాం. చనిపోతున్నాం మాకోసం రావదు.్ద’ అంటూ చెప్పినట్టు తెలిసింది. వెంటనే కాలనీ యువకులు, వారి కుటుంబీకులు పుణ్యగిరికి పరుగెత్తారు. పుణ్యగిరి మెట్ల మార్గంలో అపస్మారక స్థితిలో ఉన్న వారిని బైక్‌లపై ఆస్పత్రికి చేర్చారు.