అత్తాపూర్: ప్రేమికులను బెదిరించి డబ్బు వసూలు చేసి అడ్డంగా బుక్కైపోయారు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన రాజేంద్రనగర్ పోలీసులు సదరు కానిస్టుబుళ్లతో పాటు హోంగార్డును కటకటాల వెనక్కి నెట్టారు. ఇన్‌స్పెక్టర్ వి.ఉమేందర్ కథనం ప్రకారం.... నగరంలోని టోలిచౌకీకి చెందిన అతిక్ తన ప్రేయసితో కలిసి మంగళవార సాయంత్రం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని జనచైతన్య వెచర్‌లో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాడు.
అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటుండగా గమనించిన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్కు చెందిన కానిస్టేబుళ్లు రవి, పరిపూర్ణాచారి, హోంగార్డు ఆనంద్ వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా వారిని బెదిరించి రూ. లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రేమికులు వారి వద్ద ఉన్న రూ. 29 వేలు ఇచ్చి.. మిగతావి తర్వాత ఇస్తామని చెప్పి వెళ్లిపోయారు. అతిక్ సెల్‌ఫోన్ నెంబర్ తీసుకున్న పోలీసులు అదే రోజు రాత్రి అతడికి ఫోన్ చేసి మిగతా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అతిక్ తనకు తెలిసిన వారి ద్వారా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయం తీసుకెళ్లి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారుల ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేయగా కానిస్టేబుళ్లు రవి, పరిపూర్ణాచారి, హోంగార్డు ఆనంద్‌లపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలింది. దీంతో ముగ్గురినీ బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.