లక్కీ డ్రా నిర్వాహకులు అరెస్టు
లక్కీ డ్రా నిర్వాహకులు అరెస్టు
Published Sun, Jan 15 2017 9:02 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM
- లక్కీ డ్రా పేరుతో రూ. 1300 ప్రకారం వసూలు
- 3500 మంది నుంచి రూ. 45.50 లక్షలు
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
మంత్రాలయం రూరల్: ‘రూ. 1300 చెల్లించి టికెట్ కొనుక్కోండి... తగిలితే మంచి బహుమతి వస్తుంది.. లేకపోయినా ఆ విలువకు తగ్గట్టు ఏదో ఒక వస్తువు అందిస్తాం’ అంటూ కొందరు.. జనానికి ఆశ చూపించి లక్కి డ్రా పేరుతో వసూళ్లకు పాల్పడ్డారు. ఇలా 3500 మంది నుంచి 45.50 లక్షలు వసూలు చేశారు. ఒప్పందం ప్రకారం ఈ నెల 9వతేదీన కోసిగి చౌడేశ్వరి దేవాలయం వద్ద డిప్పు వేయాల్సి ఉండగా ఇదిగో.. అదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. చివరకు వారిపై అనుమానం పెరగడంతో కోసిగికి చెందిన కొందరు నిలదీయగా మంత్రాలయం వైష్ణవి పాఠశాల వద్ద ఆదివారం డిప్పు తీస్తుండగా మంత్రాలయం ఎస్‌ఐ శ్రీనివాసనాయక్ అదుపులోకి తీసుకున్నారు.
సీఐ నాగేశ్వరరావు ఎస్‌ఐలు రాజారెడ్డి, శ్రీనివాసనాయక్, భానుమూర్తి , స్పెషల్ పార్టీ సిబ్బందితో వైష్ణవి స్కూల్ దగ్గరకు చేరుకుని లక్కీ డ్రా నిర్వాహకులైన మంత్రాలయం మండలం సూగూరుకు చెందిన జె.చంద్రశేఖర్, కోసిగికి చెందిన ఎస్.రత్నయ్య, పి.రాఘవేంద్ర, సుభాన్‌సాహెచ్‌ను అరెస్టు చేశారు. అయితే వారిని అరెస్టు చేస్తే తాము చెల్లించిన డబ్బు ఎలా అంటూ జనం అక్కడకు దూసుకురావడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. అనుమతి లేకుండా లక్కీడ్రా నిర్వహిస్తున్న వారిపై చీటింగ్ కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.
అనుమతి తీసుకున్నట్లు చెప్పారు: లక్ష్మన్న, పెద్దకడబూరు
మూడు నెలల క్రితం మా ఊరికి వచ్చి లక్కి డ్రా గురించి చెప్పారు. అనుమతులు కూడా తీసుకున్నట్లు చెప్పడంతో రూ. 1300 ప్రకారం చెల్లించి టికెట్లు కొనుగోలు చేశాం. డిప్పు కోసం ఇప్పటికే రెండు సార్లు ప్రదేశాలను మార్చారు. ఆదివారం మంత్రాలయంలో డ్రా తీస్తున్నట్లు తెలియడంతో ఇక్కడి వచ్చాం. చివరికి ఇదంతా మోసమని తెలిసింది.
మాకు న్యాయం చేయాలి: కమ్మరి వీరేష్, మాధవరం
ఏవో మాయ మాటలు చెప్పడంతో టికెట్ కొనుక్కొని రూ. 1300 చెల్లించాం. ఇప్పుడు మోసమని తెలిసింది కనుక ఆర్గనైజర్‌ల దగ్గరి నుంచి మాకు డబ్బులు ఇప్పించాలి.
Advertisement
Advertisement