
భువనచంద్రకు డాక్టరేట్
- ప్రదానం చేసిన అకాడమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్ సంస్థ
- సాహిత్య సేవకు గాను అందజేత
చింతలపూడి : మారుమూల పల్లె నుంచి ప్రసిద్ధ సినీ గేయ రచయితగా ఎదగడమే కాక సాహిత్యంలోనూ తన ప్రతిభ చూపుతున్న మెట్ట ఆణిముత్యం భువనచంద్రకు అరుదైన గౌరవం దక్కింది. కర్నాటకలోని అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ ఈ నెల 11న గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ఈ విషయాన్ని చింతలపూడి ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అల్లంశెట్టి సత్యనారాయణ గురువారం విలేకరులకు తెలిపారు. డాక్టరేట్ అందుకున్న సందర్భంగా అభినందనలు తెలిపారు.
విద్యాభ్యాసం అంతా చింతలపూడిలోనే..
పశ్చిమగోదావరి జిల్లా, చింతలపూడికి చెందిన ఊరకరణం గుర్రాజు(భువనచంద్ర) సినీ గేయ రచయితగా ప్రసిద్ధి చెందారు. అంతేకాకుండా సినీ మాటల రచయితగా, కథకుడిగా, నవలా రచయితగా కూడా రాణిస్తున్నారు. ఆయన రచించిన ‘వాళ్లు’ అనే ఆధ్యాత్మిక నవల విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భువనచంద్ర రచించిన అనేక కథలు స్వాతి, నవ్య వారపత్రికల్లో ప్రచురితమయ్యాయి. భువనచంద్ర పుట్టింది కృష్ణాజిల్లా గుళ్లపూడి గ్రామంలో. తల్లిదండ్రులు సుబ్రహ్మణ్యేశ్వరశర్మ, చంద్రమౌళీశ్వరీదేవి. భువనచంద్రకు రెండేళ్ల వయస్సులో కుటుంబంతో సహా పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి వచ్చేశారు. అప్పటి నుంచి ఆయన విద్యాభ్యాసం చింతలపూడిలోనే సాగింది.
సైనికులకు అంకితం ఇస్తున్నా..
డాక్టరేట్ రావడం సంతోషంగా ఉంది. అయితే నేనెప్పుడూ అవార్డుల కోసం ఏదీ రాయలేదు. అవార్డు అనేది ఒక అలంకారం మాత్రమే. మనం ప్రశాంతంగా నిద్రపోవడానికి బోర్డర్‌లో కాపు కాస్తున్న సైనికులే కారణం. ఒక సినిమా రచయితగా కాకుండా సైనికుడికి ఇచ్చిన గౌరవంగా నాకు అందిన డాక్టరేట్‌ను భావిస్తున్నాను.
అందుకే అకాడమీ ఆఫ్ యూనివర్శల్ గ్లోబల్ పీస్ ఇచ్చిన డాక్టరేట్‌ను 18 ఏళ్లు సైనికుడిగా పని చేసిన నేను భారత సైనికులకు అంకితమిస్తున్నాను. అలాగే నా తల్లిదండ్రులు, స్కూల్ టీచర్లు, లైబ్రరీలో నేను ఎక్కువ పుస్తకాలు చదివి ఈ స్థాయికి రావడానికి ప్రోత్సహించిన లైబ్రేరియన్ దాశరథి, మేడుకొండూరి రామకృష్ణలకు కృతజ్ఞతలు.
వచ్చేనెలలో మరో నాలుగు పుస్తకాలు ఎమ్మెస్కో వారు విడుదల చేస్తున్నారు. వాటిలో చింతలపూడి ఆశ్రమానికి చెందిన శ్రీ బోధ, బోధానందామృతం నవలలు కాగా, మిగిలిన రెండు పుస్తకాలు కథా సంపుటాలు. ఆశ్రమంలో నా చిన్నతనంలో జరిగిన సంఘటనలు, స్వామీజీ చెప్పిన మంచి మాటలను ఈ పుస్తకాల్లో పొందు పరిచాను. భావి తరాలకు ఈ పుస్తకాలు మార్గదర్శకమవుతాయి.
-భువనచంద్ర, ప్రసిద్ధ సినీ గేయ రచయిత