తప్పని ఎదురు చూపులు..
– ‘ఆడపిల్ల పథకం’ కింద 556 మంది ఎంపిక
– ఐదేళ్లుగా పంపిణీకి నోచుకోని బాండ్లు
– ఆయోమయంలో ఆడపిల్లల తల్లిదండ్రులు
తాడిపత్రి టౌన్ : ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ‘మాఇంటి మహాలక్ష్మి’కి ఆదరణ కరువైంది. పథకం కింద దరఖాస్తు చేసుకున్నా ఐదేళ్లుగా బాండ్లు అందక ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పడం లేదు. బాండ్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలే దంటునానరు. త్వరలో పంపిణీ చేస్తామని అధికారులు చెపుతున్నారని, అసలు వస్తాయా..లేదా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. తాడిపత్రి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 556 మంది ఆడపిల్లలు ఆడపిల్ల పథకం కింద ఎంపికయ్యారు.
పంపిణీ కానీ బాండ్లు
తాడిపత్రి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ‘ఆడపిల్ల పథకం’ కింద పలువురు ధరఖాస్తు చేసుకున్నారు. 2010లో 234 మంది, 2011లో 220 మంది ,2012లో 102 మందికి ఆడపిల్లలను పథకం క్రింద ప్రభుత్వం ఎంపిక చేసింది. ఆయితే అప్పటి నుండి మంజూరుకు సంబంధించిన బాండ్లను అధికారులు పంపిణీ చేయలేదు. దీంతో లబ్దిదారుల తల్లిదండ్రులు ఆఫీసుల చుట్టుతిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం నుండి బాండ్లు వచ్చిన వెంటనే పంపిణీ చేస్తామని అధికారులు చెపుతున్నారు. కానీ దాదాపు నాలుగేండ్లు కావస్తున్న బాండ్లు పంపిణీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. కొత్త ఆడపిల్ల పథకం స్థానంలో మా ఇంటి మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశ పెట్టిప్పటికీ ఇంత వరకూ లబ్ధిదారులకు చేరలేదు. అధికారులు స్పందించి బాండ్లు పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు.
బాలసంరక్షణే లక్ష్యంగా
లింగ వివక్షతను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త ఆడపిల్ల (బంగారుతల్లి) పథకాన్ని 2005లో ఆప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈపథకం బాలికల సంరక్షణ, బాలికల విద్యను ప్రోత్సహిస్తూ, బాల్య వివాహాలను అరికట్టుటతోపాటు వారి అర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక కుటుంబంలో ఒక బాలిక ఉంటే 20 ఏళ్ల తరువాత లక్ష, ఇద్దరు ఆడపిల్లలుంటే 20 ఏళ్లు నిండిన తర్వాత రూ.30 వేలు ఇవ్వనున్నారు. ఆలాగే బాలికల చదువును ప్రొత్సహిస్తూ 9వ తరగతి నుండి ఇంటర్, ఐటీఐ, చదువుకు ఏడాదికి రూ.1200 ఇవ్వనున్నది. అలాగే ఎంపిక చేసిన తల్లిదండ్రులు సహజ మరణంఅయితే రూ.30వేలు, ప్రమదావశాత్తు మరణించిన వారికి రూ.75 వేలు ప్రభుత్వం ప్రకటించింది.
తిరుగలేకపోతున్నాం
నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒకరికి ఆడపిల్ల పథకం కింద 2012లో ఎంపికైంది. మంజూరుకు సంబందించిన బాండ్ల కోసం ఆఫీసు చుట్టు తిరుగుతున్నా. అధికారులు, సిబ్బంది బాండ్ల పంపిణీపై సరైన సమాచారం ఇవ్వలేదు.
– రాజేశ్వరి, తాడిపత్రి
ఆశ వదులుకున్నాం
మేం కూలి పని చేసుకోని జీవిస్తున్నాం. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఒక ఆడపిల్లకు 2011లో ఆడపిల్ల పథకం కింద ఎంపికైంది. కానీ బాండ్లు ఇవ్వలేదు. పలుమార్లు అధికారులను అడిగినా పట్టించుకోలేదు. ఆశ వదులుకున్నాం.
– వాసవీ,మహిళ, తాడిపత్రి
అసలు ఇస్తారా..లేదా?
ఆడపిల్ల పథకాన్ని ప్రభుత్వం ప్రారంబించింది. కానీ అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బాండ్లు ఇవ్వడంలో అధికారులు ఆలస్యం చేస్తున్నారు. అసలు ఇస్తారా,లేదో అధికారులు చెప్పాలి.
– విజయలక్ష్మి, మహళ, తాడిపత్రి
త్వరలో బాండ్లు పంపిణీ చేస్తాం
2010,11, 12 సంవత్సరాల్లో కొత్త బాలిక సంరక్షణ పథకం కింద ఎంపికైన ఆడపిల్లలకు సంబంధించిన బాండ్లు జిల్లా కేంద్రానికి వచ్చాయి. త్వరలోనే పిల్లల తల్లిదండ్రులకు పంపిణీ చేస్తాం.
– శశికళ, సీడీపీఓ, తాడిపత్రి
ఎక్కడమ్మా.. ‘మా ఇంటి మహాలక్ష్మి’
Published Fri, Aug 12 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM
Advertisement