మహాలక్ష్మీ మనసాస్మరామి
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దీపావళిని పురస్కరించుకుని ఆదివారం దుర్గమ్మ మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కాసుల పేరు, కంఠాభరణాలు, నెక్లెస్‌లు, హారాలు, గజ తోరణాలు.. ఇలా ఒకటేమిటి అనేక బంగారు నగలను అమ్మవారికి అలంకరించారు. ఆ ముగ్ధమనోహర రూపాన్ని దర్శించుకున్న భక్తులు తన్మయత్వానికి గురయ్యారు. తెల్లవారుజామున ప్రత్యేక అలంకరణ అనంతరం నిత్య పూజలు జరిగాయి. నాలుగు గంటలకు ఖడ్గమాల పూజ నిర్వహించగా, ఈవో సూర్యకుమారి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మహానివేదన అనంతరం రద్దీ మరింత పెరిగింది. శ్రీచక్రనవార్చన, చండీయాగంలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం పంచహారతులు, పల్లకీ సేవ అనంతరం అమ్మవారి ఆలయం చుట్టూ దీపాలు వెలిగించి దీపావళి వేడుకలు నిర్వహించారు.
కొనసాగిన గాజుల పంపిణీ
అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు పంపిణీ చేశారు. ఉచిత, రూ.300 టికెట్ క్యూలైన్‌లో దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయ సిబ్బంది గాజులు అందజేశారు. దీపావళి రోజున మహాలక్ష్మిగా అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా గాజులను అందుకోవడం సంతోషంగా ఉందని పలువురు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.