ఏసీబీ వలలో మహానంది దేవస్థానం ఉద్యోగి
- కాంట్రాక్టర్‌ను రూ. 10 వేలు డిమాండ్ చేసిన డ్రాఫ్ట్స్‌మెన్
- ఏబీసీ అధికారులను ఆశ్రయించిన కాంట్రాక్టర్
- పథకం ప్రకారం పట్టుకున్న వైనం
మహానంది: ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ మహానంది దేవస్థానం ఉద్యోగి, డ్రాఫ్ట్స్‌మెన్ సర్వేశ్వరుడు ఆలియాస్ సర్వేశ్వరరావు ఏసీబీ అధికారులకు దొరికాడు. ఏసీబీ కర్నూలు డీఎస్పీ జయరామరాజు తెలిపిన వివరాల మేరకు....మహానంది దేవస్థానంలో 2013లో అన్నదాన భవనం, అభిషేక మండపాల నిర్మాణానికి రూ. 1.98 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిర్మాణాలను నెల్లూరుకు చెందిన రమేష్‌రెడ్డి దక్కించుకున్నారు. ఆయన పేరు మీద తన మిత్రుడు శ్యాంసుందర్‌రెడ్డి పనులు చేశాడు. గత ఏడాది నవంబర్‌లో భవనాలను ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి సంబంధిత కాంట్రాక్టర్ శ్యాంసుందర్‌రెడ్డికి రూ. 6 లక్షలు ఎఫ్‌ఎస్‌డీ వెనక్కి రావాలి. దీనికి సంబంధించిన బిల్లులు, రికార్డులను ఎం–బుక్‌లో రూపొందించి బిల్లులు తయారు చేసి దేవస్థానం కార్యనిర్వహణాధికారితో సంతకం చేయించాల్సి ఉంది. అయితే ఈ పనులకు డ్రాఫ్ట్స్‌మెన్ సర్వేశ్వరుడు రూ. 10 వేలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ మేరకు పథకంలో భాగంగా సోమవారం స్థానిక అన్నదానం భవనం వద్ద కాంట్రాక్టర్ శ్యాంసుందర్‌రెడ్డి ఉద్యోగికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ జయరామరాజు తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు సీతారామారావు, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీశైలంలోనూ అవినీతి ఆరోపణలు:
డ్రాఫ్ట్స్‌మెన్ సర్వేశ్వరుడు ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా శ్రీశైలం నుంచి మహానందికి వచ్చారు. అయితే ఆయన శ్రీశైలం దేవస్థానంలో పనిచేసే సమయంలోనూ ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. గతంలో ‘సాక్షి’లో సైతం లోగుట్టు సర్వేశ్వరుడికెరుక అన్న శీర్షికతో అతని అక్రమాలపై కథనం ప్రచురించింది. మహానంది దేవస్థానంలో పనిచేస్తూ ఓ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరకడం ఇదే ప్రథమం కావడంతో స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.