101 మీటర్లకు ‘మహా’ ఓకే
- మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకారం
- 102 మీటర్లకు అంగీకరించాలన్న తెలంగాణ
- సీఎంల సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదన
- మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో హరీశ్ చర్చలు
- అంతర్రాష్ట్ర బోర్డు భేటీకి వచ్చేందుకు ఫడ్నవిస్ సుముఖం
- మేడిగడ్డ డిజైన్లు, ప్రణాళికలు రెండు రాష్ట్రాల సీడీఓల పరిశీలనకి..
- నేడు ఢిల్లీలో సీఎం కేసీఆర్‌తో మహారాష్ట్ర సీఎం భేటీ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న మేడిగడ్డ బ్యారేజీపై తెలంగాణ, మహారాష్ట్ర మధ్య చర్చలు ఫలప్రదమయ్యాయి. 102 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి అంగీకరించాలని తెలంగాణ కోరగా.. 101 మీటర్లకు మహారాష్ట్ర సూత్రప్రాయంగా అంగీకరించింది. 102 మీటర్ల ఎత్తుపై ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగే సమావేశంలో చర్చించి తుది నిర్ణయం చేద్దామని ప్రతిపాదించింది. అలాగే సీఎంల స్థాయిలో ఏర్పాటైన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సానుకూలత తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం అంశంపై చర్చించేందుకు ముంబై వెళ్లిన భారీ నీటి పారుదల మంత్రి టి.హరీశ్‌రావు మంగళవారం సాయంత్రం సహ్యాద్రి గెస్ట్‌హౌస్‌లో ఫడ్నవిస్‌తో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో త్వరలో జరిగే అంతర్రాష్ట్ర బోర్డు సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. సమావేశం తేదీని నిర్ణయించాలని కోరారు. ఈ భేటీలో పాల్గొంటానని ఈ సందర్భంగా ఫడ్నవీస్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగానే మేడిగడ్డ బ్యారేజీ డిజైన్లు, నిర్మాణ ప్రణాళికలు, ఇతర సాంకేతిక వివరాలను రెండు రాష్ట్రాల సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ) ఇంజనీర్లు ఖరారు చేసుకోవాలని, బోర్డు సమావేశంలో సీడీఓ అధికారులిచ్చే నివేదికను తుది ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించారు. అనంతరం మంత్రి హరీశ్ మహారాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి గిరీశ్ మహజన్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి, కాళేశ్వరం సీఈ వెంకటేశ్వర్లు, మహారాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అంబరీష్ ఆత్రం, ముఖ్య కార్యదర్శి ఐఎస్ చహాల్, సీఈ చౌహాన్‌లు పాల్గొన్నారు.
మహారాష్ట్రకు ముంపు సమస్య లేదు
రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సర్వే వివరాలపై ఇరు రాష్ట్రాల మంత్రులు సమీక్షించారు. మేడిగడ్డ బ్యారేజీతో గడ్చిరోలీ జిల్లా సిరోంఛ తాలుకాలోని 11 గ్రామాల సరిహద్దుల్లో కేవలం 55 హెక్టార్ల భూమి మాత్రమే ముంపునకు గురవుతున్నట్లు మంత్రులు నిర్ధారించుకున్నారు. అతి తక్కువ ముంపుతోనే ప్రాజెక్టులు నిర్మించాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంకల్పించారని, కాళేశ్వరం ప్రాజెక్టుతో మహారాష్ట్ర గ్రామాలకు పెద్దగా ముంపు సమస్యలేదని మంత్రి హరీశ్ ఈ సందర్భంగా వివరించారు. ఈ వాదనతో మహారాష్ట్ర ఏకీభవించింది. అలాగే నిజామాబాద్ జిల్లాలోని లెండి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు కోరగా.. అందుకు గిరీశ్ మహ జన్ సానుకూలంగా స్పందించారు. అనంతరం రెండు రాష్ట్రాల మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంతో 25 గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయని, 25 వేల హెక్టార్లలో భూములు ముంపునకు గురవుతాయంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తుండటాన్ని ఖండించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రాంతానికో విధానం, రాష్ట్రానికో సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అవలంబిస్తోందని మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు సంయుక్తంగా లైడార్ సర్వేలు నిర్వహించిన అనంతరమే ప్రాజెక్టు నిర్మాణంపై అవగాహనకు వచ్చినట్లు తెలిపారు.
నేడు ఫడ్నవీస్, కేసీఆర్ భేటీ!
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ బుధవారం ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పర్యటనలోనే ఉన్న సీఎం కే సీఆర్‌తో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇరువురు సీఎంల మధ్య మేడిగడ్డ ఎత్తు, ముఖ్యమంత్రుల సమావేశం తేదీ, ఒప్పందాల ఖరారు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.