- కారు బోల్తాపడి మహారాష్ట్ర వాసి మృతి
- మిషన్ భగీరథ పనులకు రాగా ప్రమాదం
బతుకుదెరువు కోసం వచ్చి అనంతలోకాలకు..
Published Thu, Jul 28 2016 11:54 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
కేసముద్రం : బతుకుదెరువు కోసం మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ వ్యక్తి కారు బోల్తా కొట్టి భార్య కళ్లెదుటే ప్రాణాలు విడిచిన ఘటన మండలంలోని రంగాపురం గ్రామ శివారు రాజీవ్‌నగర్‌తండా సమీపంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై ఫణిదర్ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని పాన్‌గన్‌కు చెందిన రమేష్‌పండిట్ రాథోడ్(42), సంగీత దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం మానుకోట నుంచి కేసముద్రం వైపు మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయని, ఉపాధి దొరుకుతోందని మానుకోటలో ఉంటున్న రమేష్ పండిట్ బంధువులు సమాచారం అందించారు.
దీంతో భార్య సంగీతతో కలిసి రెండు రోజుల క్రితం తన సొంతకారులో వచ్చాడు. కేసముద్రంలో ఉంటున్న కాంట్రాక్టర్‌ను కలిసేందుకు గురువారం తెల్లవారుజామున సంగీతలో కలిసి కారులో బయలుదేరాడు. అతడి వెనుక బైక్‌పై బంధువులు కూడా వస్తున్నారు. రంగాపురం శివారు రాజీవ్‌నగర్‌తండా సమీపంలోని ప్రధాన రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని రెండు పల్టీలు కొట్టింది. దీంతో రమేష్‌పండిట్‌రాథోడ్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. కారు వెనుక సీటులో కూర్చున్న సంగీతకు గాయాలయ్యాయి. వెనకాల వచ్చిన బంధువులు చూసి కారులోపలున్న సంగీతను బయటకు తీశారు. కళ్లముందే భర్త మృతిచెందడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Advertisement