ఆధునికతే అసలైన దత్తత
గ్రామాభివృద్ధిపై నమ్రత శిరోడ్కర్
బుర్రిపాలెంలోపర్యటన
ప్రజల అవసరాలు తెలుసుకున్న మహేష్‌బాబు భార్య
తెనాలి : గ్రామాన్ని దత్తత తీసుకోవడమంటే కేవలం రోడ్లు వేయడం, రంగులు పూయడం కాదని, ఆధునిక గ్రామంగా తీర్చిదిద్దడం, ప్రజలను చైతన్యం చేసి భాగ స్వాములను చేయడం, వారి జీవన ప్రమాణాలను పెంచడమని ప్రిన్స్ మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోడ్కర్ చెప్పారు. బుర్రిపాలెం గ్రామాన్ని మహేష్‌బాబు దత్తత తీసుకున్న నేపథ్యంలో అక్కడి ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు నమ్రత, మహేష్ సోదరి గల్లా పద్మావతి గురువారం గ్రామంలో పర్యటించారు.
అనంతరం స్థానిక కల్యాణమండపంలో గ్రామ సర్పంచి కొండూరు సామ్రాజ్యం అధ్యక్షతన ఏర్పాటుచేసిన బహిరంగ సభలో గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. నమ్రత మాట్లాడుతూ బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా గుర్తింపును పొందాల్సి ఉందన్నారు. అప్పుడే అనారోగ్య సమస్యలు తొలగి వైద్య ఖర్చులు తగ్గిపోతాయని చెప్పారు.
మద్యపానం, ధూమపానం సాధ్యమైనంతగా తగ్గించాలని, అక్షరాస్యతను నూరు శాతానికి చేర్చాలన్నారు. అంతా ఐక్యంగా ఉండాలని, తరచూ గ్రామసభలు నిర్వహించి, అన్ని వర్గాలను భాగస్వాములను చేసి ముందుకు నడవాలని చెప్పారు. గ్రామంలో వివిధ పనులకు కమిటీలను ఏర్పాటుచేసుకోవాలని, గ్రామాభివృద్ధిని పర్యవేక్షించాలని సలహానిచ్చారు. సభకు ముందు అంగన్‌వాడి కార్యకర్త శ్రీలక్ష్మి, డ్వాక్రా మహిళ ఘట్టమనేని సామ్రాజ్యం, ప్రధానోపాధ్యాయుడు లలితా ప్రసాద్ ఆయా విభాగాలకు సంబంధించిన అవసరాలను ప్రస్తావించారు.
వాకా పాములు సభకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవీ శ్రీనివాస్, తహశీల్దార్ జీవీ సుబ్బారెడ్డి, ఎంఈవో రవికాంత్, ఎంపీపీ ఎస్.వెంకట్రావు, జెడ్పీటీసీ ఎ.జయలక్ష్మి, పాలకేంద్రం అధ్యక్షుడు చలపతిరావు, నీటిసంఘం అధ్యక్షుడు కోటా వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి ప్రియబాంధవి, మార్కెట్ యార్డు డెరైక్టర్ కంచర్ల ఏడుకొండలు, పి.శ్రీనివాస్, అశోక్, డి.శారద పాల్గొన్నారు.
అడుగడుగునా స్వాగతం
నమ్రతకు బుర్రిపాలెం గ్రామస్తులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. గ్రామంలోని మౌలిక సదుపాయాలు, అక్కడి కుటుంబాల వివరాలతో సహా సమగ్ర సమాచారాన్ని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పంపిన ప్రత్యేక బృందం ఇప్పటికే సేకరించింది. ఈ క్రమంలో అక్కడి ప్రజల మనోగతాన్ని, అవసరాలను స్వయంగా తెలుసుకునే నిమిత్తం నమ్రత, మహేష్‌బాబు సోదరి, జయదేవ్ భార్య పద్మావతితో కలిసి వచ్చారు. తొలుత హీరో కృష్ణ ఇంట్లో ఆయన తలిదండ్రులు ఘట్టమనేని నాగరత్నమ్మ, వీరరాఘవయ్య చౌదరి చిత్రపటానికి పూలమాల వేసిన నమ్రత ఉదయం 9.30 గంటల నుంచి గ్రామంలో పర్యటించారు.
వీధుల్లో నడుస్తూ.. ముందుగా కృష్ణ తల్లిదండ్రులు నిర్మించిన గీతామందిరానికి వెళ్లి సాయిబాబాను దర్శించుకున్నారు. అనంతరం ఎస్సీ కాలనీకి వెళ్లి, అక్కడి చ ర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కాలనీలో మహిళలను పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఘట్టమనేని నాగరత్నమ్మ పేరిట నడుస్తున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడు లలితాప్రసాద్, విద్యార్థులు, ఉపాధ్యాయులను పలకరించారు. అక్కడి అవసరాలను తెలుసుకున్నారు. పాఠశాల ఎదుట సరస్వతీదేవి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించారు. అక్కడ మొక్క నాటారు. అనంతరం గ్రామంలోని కల్యాణమండపంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు.
మళ్లీ మహేష్‌తో వస్తా..
బాబు (మహేష్‌బాబు)కు బుర్రిపాలెం ఊరంటే చాలా ఇష్టమని నమ్రత చెప్పారు. తనతోపాటే మహేష్ రావాల్సి ఉందని, బిజీ షెడ్యూలు కారణంగా రాలేకపోయినట్టు చెప్పారు. గ్రామస్తులు చూపించిన ప్రేమ, ఆప్యాయతలు, ఆతిథ్యానికి ధన్యవాదాలు చెబుతూ ‘మళ్లీ వస్తా.. మహేష్‌తో’ అన్నారు. తొలుత ‘అందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో మాట్లాడటం ఆరంభించిన నమ్రత కొద్దిసేపు తెలుగులోనే మాట్లాడినా.. సరిగ్గా రాదని చెబుతూ ఇంగ్లిష్‌లో ప్రసంగించారు.
దేవినేని కరుణ చంద్రబాబు ఆమె ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. మహేష్‌బాబు, నమ్రత, వారి పిల్లలతో రూపొందించిన టెలీఫిలిం, 2015 ‘రిఫ్లెక్షన్స్’ పేరుతో ఎంపీ గల్లా జయదేవ్ చిత్రమాలికను ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ప్రదర్శించారు.
దుర్గమ్మను దర్శించుకున్న నమ్రత
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : సినీ నటుడు మహేష్‌బాబు సతీమణి నమత్ర గురువారం దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి వచ్చిన నమత్రకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించగా, ఏఈవో అచ్యుతరామయ్య అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. నమత్రను తమ సెల్‌ఫోన్‌లతో ఫొటోలు తీసేందుకు భక్తులు ఉత్సాహం చూపారు.