రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండా
నకిరేకల్ : రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. నకిరేకల్ పట్టణంలో 3.8కోట్లతో నిమ్మ మార్కెట్‌కు, రూ. 3.7కోట్లతో మినీ ట్యాంక్ నిర్మాణ పనులకు స్థానిక పెద్ద చెరువు వద్ద సోమవారం మంత్రి జగదీశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. స్థానిక మెయిన్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. అందరికంటే ముఖ్యంగా రైతన్న బాగుండాలనదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో 45శాతం నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు.
రూ.25వేల కోట్ల నిధులతో రైతుల కోసం ఊరూరా మిషన్ కాకతీయ కింద చెరువుల బాగు కోసం ఖర్చుచేశామన్నారు. ఒకప్పుడు చెరువు మీదకు వెళ్తే సర్కారు, తుమ్మ చెట్లు తప్ప మరేవి కనపడేవి కావు. గత పాలకులు చెరువుల బాగు గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు. నేడు తెలంగాణ ప్రభుత్వం హయూంలో గ్రామంలోని చెరువులు నీటితో నిండుగాా కళకళలాడుతూ ఊరికి జీవనోపాధిగా నిలిచాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రాబోయే యాసంగి పంటలలో రైతులకు 9గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామన్నారు.
ఒక్క చుక్క మూసీ నీటిని కూడా కృష్ణాలోకి పోనివ్వం..
ఈ జిల్లాలకు హరితహారంలో సీఎం కేసీఆర్ వచ్చినప్పుడు రూ.285 కోట్లను మూసీ ఆధునీకరణ కోసం అడగగానే వెంటనే నిధులు మంజూరు చేశామని, త్వరలో టెండర్లు పిలిపించి ఈ ఎండాకాలంలోనే మూసీ కాల్వల ఆధునీకరణ పనులు చేపట్టి ఒక్కచుక్క మూసీ నీటిని కృష్ణానదిలోకి పోనివ్వకుండా కృషి చేస్తామన్నారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా త్వరలోనే టెండర్లు వేసి అతిత్వరలోనే పనులు ప్రారంభించి జిల్లా రైతాంగానికి సాగునీరు అందించే ప్రయత్నం తమ ప్రభుత్వం చేయబోతుందన్నారు.
ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, అటవీశాఖ రాష్ట్ర చైర్మన్ బండ నరేందర్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ బాలునాయక్, ఎమ్మెల్సీ పూలరవీందర్, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, నకిరేకల్, శాలిగౌరారం మండలాల జెడ్పీటీసీలు పెండెం ధనలక్ష్మి సదానందం, ఐతగోని సునిత, ఎంపీపీలు రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, లింగస్వామి, నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, సుంకరి మల్లేష్‌గౌడ్, పూజర్ల శంభయ్య, సోమ యాదగిరి, వీర్లపాటి రమేష్, వివిధ మండలాల మండల శాఖ అధ్యక్షులు పల్‌రెడ్డి నర్సింహారెడ్డి, వెంకట్‌రెడ్డి, రహీంఖాన్, రాములు, వెంకన్న, శ్రీనివాస్ ఉన్నారు.