చిన్నప్పటి నుంచీ నేర ప్రవృత్తే | Major success! Andhra Pradesh and Telangana's most wanted gangster Naeem shot dead in police encounter | Sakshi
Sakshi News home page

చిన్నప్పటి నుంచీ నేర ప్రవృత్తే

Published Tue, Aug 9 2016 4:15 AM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

చిన్నప్పటి నుంచీ నేర ప్రవృత్తే - Sakshi

చిన్నప్పటి నుంచీ నేర ప్రవృత్తే

ఎన్నో హత్యలు.. మరెన్నో ఘోరాలు చేసిన నయీమ్
* ఐపీఎస్ వ్యాస్ హత్యానంతరం పోలీసులకు కోవర్టుగా
* అజ్ఞాతంలో ఉంటూనే నేర సామ్రాజ్యం విస్తరణ
* వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో దిట్ట
* అధికార పార్టీ ఎమ్మెల్యేలకూ తప్పని బెదిరింపులు

భువనగిరి: చిన్నతనంలోనే విద్యార్థి సంఘాల్లో చురుగ్గా వ్యవహరించిన నయీముద్దీన్ అలియాస్ నయీం.. తొలి నుంచీ నేర ప్రవృత్తి ప్రదర్శించేవాడు. అప్పట్లోనే పాములు, తేళ్లు జేబులో వేసుకుని వచ్చి తోటి వారిని భయపెట్టేవాడని.. అతడితో కలసి చదువుకున్నవారు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరిలోని బీచ్ మొహల్లా దర్గా సమీపంలో నివాసముండే ఎండీ నిజాముద్దీన్, అయేషాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు.

అందులో పెద్ద కుమారుడు నయీం. భువనగిరిలోని బీచ్‌మొహల్లా ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడే ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘంలో చురుకుగా వ్యవహరించాడు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ సీఈసీ చదువుతున్నప్పుడు ఎస్‌ఎఫ్‌ఐలోకి మారాడు. తర్వాత ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్ డిగ్రీ కళాశాలలో చదువుతూ.. పీపుల్స్‌వార్ అనుబంధ సంస్థ ఆర్‌ఎస్‌యూలో చేరాడు. విద్యార్థిగా ఉన్నప్పుడే నయీంలో నేర స్వభావం కనిపించేదని అప్పటి తోటి విద్యార్థులు వెల్లడించారు. పాములు, తేళ్లు జేబులో వేసుకుని వచ్చి తోటి వారిని భయపెట్టేవాడని చెప్పారు.
 
బ్రహ్మోత్సవాల్లో పోలీసులపై బాంబు దాడి
1990లో ఆర్‌ఎస్‌యూలో చేరిన నయీమ్ పీపుల్స్‌వార్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పోలీసులు తనిఖీలు జరుపుతుండగా వారిపై బాంబు దాడి చేశాడు. అప్రమత్తమైన పోలీసులు నయీంను పట్టుకుని జైలుకు పంపించారు. జైల్లో పీపుల్స్‌వార్ అగ్రనాయకులతో పరిచయం పెరిగింది. అయితే ఆ సమయంలో పీపుల్స్‌వార్‌ను అంతం చేయడానికి ఐపీఎస్ అధికారి వ్యాస్.. గ్రేహౌండ్స్ పోలీస్ వ్యవస్థను రూపొందించారు.

దీంతో వ్యాస్‌పై కక్షగట్టిన పీపుల్స్‌వార్.. ఆయనను చంపేందుకు ఏర్పాటు చేసిన యాక్షన్ టీంలో నయీమ్ ఒకడు. 1993లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యాస్‌ను ఏకే-47తో అతి సమీపం నుంచి కాల్చి హతమార్చారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే పీపుల్స్‌వార్‌లో పటేల్ సుధాకర్‌రెడ్డి, శాఖమూరి అప్పారావులతో విభేదాలు రావడంతో 1999లో పోలీసులకు లొంగిపోయాడు.
 
నక్సలైట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా..
పీపుల్స్‌వార్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నక్సల్స్‌ను అంతం చేయడమే తన జీవితాశయమని నయీమ్ ప్రకటించాడు. దీనికి సంబంధించి తెలంగాణవ్యాప్తంగా పలు చోట్ల ప్రదర్శనలు కూడా నిర్వహించాడు. ఈ సమయంలో పోలీసులకు కోవర్టుగా మారాడు. నయీంను చేరదీసిన పోలీసులు.. నక్సలైట్ల ఏరివేతతో పాటు అజ్ఞాత కార్యకలాపాల్లో వినియోగించుకోవడం ప్రారంభించారు. వార్‌లో పనిచేసిన సమయంలో తెలిసిన సమాచారం, ఎత్తుగడలు, డంప్‌లు, ఆయుధాలకు సంబంధించి నయీమ్ ఇచ్చిన సమాచారంతోనే.. అనేక ఎన్ కౌంటర్లలో పీపుల్స్‌వార్, మావోయిస్టు నేతలను పోలీసులు మట్టుబెట్టారనే ప్రచారం ఉంది. పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని నయీమ్ వారి చేతిలో ఆయుధంగా మారిపోయాడని పీపుల్స్‌వార్ ఆప్పట్లోనే ఆరోపించింది.
 
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో..
భువనగిరి, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చాలా వివాదాల్లో నయీమ్ పాత్ర ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కనిపిస్తుంది. భువనగిరి, ఆలేరు, వలిగొండ, నల్లగొండ, చౌటుప్పల్, వరంగల్ జిల్లా జనగామ, రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం, ఉప్పల్ ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో తన అనుచరులతో రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లు చేయించేవాడు. రియల్ ఎస్టేట్ బూమ్ తగ్గాక ఆ ముఠా ఆస్తి తగాదాల సెటిల్‌మెంట్లకు దిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నయీమ్ అండర్ గ్రౌండ్‌లోనే ఉంటున్నా.. అతడి పేరిట కొందరు అనుచరులు, దగ్గరి బంధువులు దౌర్జాన్యాలు, అక్రమ వసూళ్లు, బెదిరింపులకు పాల్పడుతున్నారు.
 
‘కోబ్రా’ల సృష్టికర్త
మావోయిస్టులకు వ్యతిరేకంగా పనిచేస్తుండటంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా నయీంను చూసీ చూడనట్లు వదిలేసేవారనే ఆరోపణలున్నాయి. దాంతో ల్యాండ్ సెటిల్‌మెంట్లు, ఆర్థిక లావాదేవీ ల్లో నయీమ్ ముఠా చెలరేగిపోయింది. నల్లమల కోబ్రాస్, కాకతీయ కోబ్రాస్, నర్సా కోబ్రాస్, క్రాంతిసేన పేరిట రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ నయీమ్ అనుచరులను పెంచుకున్నాడు. ఆ సమయంలో మావోయిస్టు పార్టీ నుంచి బయటికి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరిన సాంబ శివుడు తమ సెటిల్‌మెంట్లకు అడ్డుతగులుతున్నాడంటూ హత్య చేయిం చాడు. సాంబశివుడు ఉద్యమంలో ఉండగా అతడి ఇంటి వద్ద త్రాచుపాములను వదిలి బంధువులను భయ భ్రాంతులకు గురిచేశాడు.
 
గణపతి నవరాత్రులతో పట్టు
నయీమ్ ఆయా ప్రాంతాల్లో పట్టు సాధించడానికి ఉర్సు, గణపతి నవరాత్రుల వంటి ఉత్సవాలను వాడుకునేవాడు. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, నల్లగొండ, వలిగొండల్లో తన అనుచరులతో ఉత్సవాలను నిర్వహించేవాడు. అందుకోసం స్థానికంగా భారీగా చందాలు వసూలు చేసి ఖర్చు చేసేవాడు. అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలతో స్థానిక యువతను ఆకర్షించి, అనుచరులుగా చేర్చుకునేవాడు.
 
ఎప్పుడూ భద్రత మధ్య..
పీపుల్స్‌వార్‌లో పనిచేసిన నయీమ్ ఎప్పుడు ఉదాసీనంగా వ్యవహరించేవాడు కాదని అతని అనుచరులు చెబుతారు. 2007 నుంచి రహస్య జీవితం గడుపుతున్న నయీం.. ఎప్పుడైనా బయటకు వస్తే పక్కా బందోబస్తుతో వచ్చేవాడు. తను ఉండే చోట ఆయుధాలతో కూడిన అనుచరులు కాపలాగా ఉంటారు. ఎక్కడా తనెవరో బయటపడకుండా జాగ్రత్త పడేవాడు. ఫొటోలకు దూరంగా ఉంటాడు. గతేడాది రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన తన కుటుంబ సభ్యుల వివాహానికి హాజరైన నయీమ్ అలాగే అనుచరుల రక్షణ మధ్యే వచ్చి వెళ్లాడు.
 
అధికార పార్టీ ఎమ్మెల్యేలతో వివాదం
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను నయీమ్ బెదిరించినట్లు సీఎంకు ఫిర్యాదులు అందాయి.  తమను నయీమ్ బెదిరిస్తున్నాడని ము ఖ్యంగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డిలు ఫిర్యాదు చేశారు. దీంతో నయీమ్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సర్కారు నిర్ణయించింది.

ముందుగా భువనగిరిలో నయీమ్ ముఖ్య అనుచరులైన పాశం శ్రీను, షకీల్, జెడ్పీటీసీ సభ్యుడు సందెల సుధాకర్‌లపై పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. భూదందాలు, డబ్బుల వసూళ్లు, బెదిరింపులు, కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కేసులు నమోదు చేశారు. ఇటీవల షకీల్ గుండెపోటుతో చనిపోగా.. పాశం శ్రీను, సందెల సుధాకర్ పోలీసులకు లొంగిపోయారు. అప్పుడే నయీమ్ కూడా లొంగిపోతున్నాడన్న వార్తలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement