నేడు మల్లన్నసాగర్ సాధన సదస్సు
-
ఎండిన నిజాంసాగర్ ప్రాజెక్టులోనే సదస్సు....
-
ప్రతిపక్షాలకు దీటైన సమాధానం చెప్పే యత్నం
-
మంత్రి హరీశ్, పోచారం, ఎమ్మెల్యేల హాజరు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :
నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ భూగర్భంలో మల్లన్నసాగర్ సాధన సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రాజెక్టుల రీ డిజైన్, కాళేశ్వరం ఎత్తిపోతల, మల్లన్నసాగర్ ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు దీటైన సమాధానం చెప్పడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సును తలపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నా నిజాంసాగర్ ప్రాజెక్టు మాత్రం రాళ్లు రప్పలు తేలి ఎడారిని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను సద్వినియోగం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటే భవిష్యత్‌లో ప్రాజెక్టులు నిజాంసాగర్‌లా మారుతాయన్న సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మూడు రోజులుగా నిజాంసాగర్ ప్రాజెక్టు శిఖంలో మంగళవారం మల్లన్నసాగర్ సాధన సదస్సును భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించే ఈ సదస్సుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. మల్లన్నసాగర్ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు.
– ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం కోసమే జలాల మళ్లింపు : మంత్రి పోచారం
ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేయడానికి గోదావరి జలాల మళ్లింపు పనులకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో మంజీరనది ఏడారిగా మారిందన్నారు. పక్క రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులతో శ్రీరాంసాగర్, సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు నీరు నిండని దుస్థితికి చేరాయన్నారు. ఉత్తర లె లంగాణ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావ్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలు రెండేళ్లల్లో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తాయని చెప్పారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న ఉద్దేశంతో అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. మల్లన్న సాగర్ సాధన సదస్సుకు నిజాంసాగర్ ప్రాజెక్టు వద్ద చేస్తున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజుతో కలిసి మంత్రి పరిశీలించి, మీడియాతో మాట్లాడారు.