నిందితులను చూపిస్తున్న పోలీసులు
భాగ్యనగర్ కాలనీ : పగలు, రాత్రి అనే తేడా లేకుండా తాళాలు పగులగొట్టి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ. 6 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఏసీపీ భుజంగరావు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా మహ్మద్‌పేట గ్రామానికి చెందిన కూచిపూడి లక్ష్మణ్ (26) ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ మాదాపూర్ ఇజ్జత్‌నగర్‌లో ఉంటున్నాడు. లక్ష్మణ్ గతంలో కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, ఎస్‌ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడి జైలుకెళ్లి వచ్చాడు.
మరో నిందితుడు మెదక్ జిల్లాకు చెందిన రామస్వామి శ్రీశైలం (33) చింతల్ దత్తాత్రేయ నగర్‌లో నివాసముంటూ కేటరింగ్ పని చేస్తున్నాడు. ఇతను జీడిమెట్ల పరిధిలోని ఓ స్క్రాప్ షాప్‌లో చోరీ చేసి జైలుకెళ్లాడు. లక్ష్మణ్, శ్రీశైలంలకు జైల్లో పరిచయం ఏర్పడి స్నేహితులయ్యారు. మూడు నెలల క్రితం జైలు నుంచి బయటకు వచ్చిన లక్ష్మణ్, శ్రీశైలం కలిసి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆరు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. దొంగిలించిన సొత్తును విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు.
మూసాపేటలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిద్దరినీ కూకట్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తమ నేరాల చిట్టీ విప్పారు. వారి వద్ద నుంచి రూ. 6 లక్షలు విలువ చేసే 20 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకొని, శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీ ఐ పురుషోత్తమ్ యాదవ్, అడిషనల్ సీఐ శంకర్‌రెడ్డి, క్రైమ్ ఎస్‌ఐ అనిల్, ఏఎస్‌ఐ మల్లారెడ్డి ఏసీపీ అభినందించారు.