కృష్ణుడు కాదు...గోవిందుడే
చనిపోయిన తమ్ముడి స్థానంలో కొనసాగి, భారతసైన్యంలో ఉద్యోగం సంపాదించాడు. సెలవుల్లో సొంతూరికి వచ్చినపుడు దోపిడీలకు పాల్పడుతూ, అక్రమంగా ఆయుధాలు విక్రయించాడు. ఈ క్రమంలో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.
చిత్తూరు (అర్బన్): గోవిందస్వామి అనే వ్యక్తి క్రిష్ణన్ పేరుతో నాలుగు రోజుల క్రితం తమిళనాడు హైకోర్టులో కలకలం సృష్టించాడు. తీరా ఇతను క్రిష్ణన్ కాదని, గోవిందస్వామి అంటూ తమిళనాడు హైకోర్టులోని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. అలాగే గోవిందస్వామి ఎప్పుడో ఆత్మహత్య చేసుకున్నాడని కూడా పేర్కొన్నారు. దీంతో తీవ్ర గందరగోళానికి గురైన న్యాయమూర్తులు ఇతను ఎవరో తేల్చడానికి ఐజీ, డీఐజీ స్థాయి అధికారి విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ( ఆ నివేదిక ఇంకా అందలేదు.) ఈనెల 21న మద్రాస్ హైకోర్టులో ఆ ఘటన జరిగింది.
ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి పత్రికల్లో అదేరోజున వార్త ప్రచురితమైంది. ఈ కథనాన్ని చూసిన చిత్తూరు పోలీసులు ఇక్కడ ఓ కేసులో క్రిష్టన్‌గా చెప్పుకుంటున్న గోవింద స్వామి నాన్‌బెయిల బుల్ వారెంటు జారీ అయిన నిందితుడని గుర్తించారు. ఈ నేపథ్యంలో మంగళవారం గోవిందస్వామిని అరెస్టు చేసి పలమనేరు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతడికి రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఈ వ్యక్తి చిత్తూరు జైలులో ఉన్నాడు. చిత్తూరు
పోలీసుల కథనం మేరకు..
తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లా పట్టావారిపల్లె తాలూక, పాపిరెడ్డిపల్లెకు చెందిన గోవిందస్వామి (29)కు ముగ్గురు సోదరులు. 2005లో తమ చిన్నాన్నను చంపేసిన కేసులో ముగ్గురూ జైలుకు వెళ్లారు. ముగ్గురిలో గోవిందస్వామి తమ్ముడయిన క్రిష్ణన్ బెయిల్‌పై బయటకొచ్చి ఆత్మహత్య చేసుకుని చనిపోయా డు. అప్పటికే అతడు భారత సైన్యంలో సిపాయి ఉద్యోగం కోసం పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తుండేవాడు. అయితే చనిపోయిన వ్యక్తి పేరు గోవిందస్వామి అంటూ తప్పుడు పేరిచ్చి.. కుటుంబ సభ్యుల సహకారంతో క్రిష్ణన్‌గా మారిపోయాడు.
2006లో క్రిష్ణన్‌కు ఆర్మీ నుంచి ఉద్యోగం వచ్చినట్లు కాల్ లెటర్ వచ్చింది. దీంతో తన తమ్ముడి సర్టిఫికెట్లు తీసుకుని తానే క్రిష్ణన్‌గా చెప్పి భారతసైన్యంలో జవానుగా గోవిందస్వామి చేరిపోయాడు. అయితే సెలవుల్లో తమిళనాడుకు వచ్చేటప్పుడు ఉత్తర భారతంలో పలు చోట్ల లభించే నాటు తుపాకీలు, అక్రమ ఆయుధాలను తీసుకొచ్చి నేరస్తులకు విక్రయించేవాడు. ఈ నేపథ్యంలో 2013, 14 సంత్సరాల్లో జిల్లాలోని వి.కోటలో అక్రమ ఆయుధాలు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. అలాగే మరోచోట దారిదోపిడీ చేసినట్లు కేసు నమోదు చేశారు.
పోలీసుల విచారణలో తాను గోవిందస్వామి అని, తన తమ్ముడు క్రిష్ణన్ చనిపోగా అతడి పేరిట చలామణి అవుతూ దోపిడీలకు పాల్పడం, అక్రమ ఆయుధాలు విక్రయించడం చేసేవాడనని పోలీసుల ఎదుట వాగ్మూలం ఇచ్చాడు. దాని తరువాత 2013లో తవణంపల్లెలో ఓ చోరీ, 2012లో కాణిపాకంలో దోపిడీ చేసింది కూడా తానేనని చెప్పడంతో ఆయా స్టేషన్లలో కేసులు నమోదయ్యా యి.
ఇతన్ని అరెస్టు చేసే సమయంలో ఆర్మీ అధికారులు సైతం విషయం తెలియక జవానును అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు అడ్డుపడ్డారు. అయితే దీర్ఘకాలంగా విచారణకు హాజరుకాకపోవడంతో పలమనేరు కోర్టు ఇతనిపై ఎన్‌బీడబ్ల్యూ (నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్) జారీ చేసింది. అప్పటికే తమిళనాడు హైకోర్టులో ఇతను తన పేరు క్రిష్ణన్ అని చెప్పి, ఓ హత్య కేసులో గోవిందస్వామిగా తన పేరు మార్చి పోలీసులు కేసును తప్పుదారి పట్టించారంటూ పిటిషన్ దాఖలు చేశాడు.
మన పోలీసులే ఛేదించారు
సమాచారం అందుకున్న చిత్తూరు పోలీసులు నిందితుడిని చెన్నైలో పట్టుకుని అరెస్టు చేశారు. గోవిందస్వామి బతి కే ఉన్నాడని మన పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు. ఇతను క్రిష్ణన్ పేరిట సైన్యంలో పనిచేయడాన్ని కూడా పసిగట్టారు. ఇక తమిళనాడులోని ధర్మపురిలో జరిగిన హత్య కేసులో నిందితుడు ఎవరు..? ప్రస్తుతం క్రిష్ణన్‌గా చెప్పుకునే గోవిందస్వామి వివరాలను మన పోలీసు ల సహకారంతో తమిళనాడు పోలీసులు చేస్తున్న దర్యాప్తు సులభతరం కానుంది.