ఇయర్ ఫోన్స్ చావును పిలిచింది!
► పాటలు వింటూ వాహనం నడపడంతో ప్రమాదం
► చినకాకాని ఎన్‌ఆర్‌ఐ జంక్షన్ వద్ద మరణించిన జిల్లావాసి
మంగళగిరి: ఇయర్ ఫోన్స్‌లో పాటలు వింటూ ద్విచక్రవాహనం నడిపిన యువకుడు నడి రోడ్డుపై ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన మంగళగిరి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. చినగంజాం మండలం గొనసపూడి గ్రామానికి చెందిన రాయపూడి సూరిబాబు, అన్నపూర్ణమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. సూరిబాబు కొంతకాలం క్రితం మృతి చెందగా కుటుంబానికి పెద్ద దిక్కుగా అతని కుమారుడు అనిల్ (30) వ్యవసాయం చేస్తూ ట్రాక్టర్ కొని జీవనం సాగిస్తున్నారు.
అనిల్‌కు ఇంకా వివాహం కాలేదు. అతని సోదరి స్రవంతిని విజయవాడలో ఓ ఉద్యోగికి ఇచ్చి వివాహం చేశారు. దీంతో కొద్ది రోజుల క్రితం అన్నపూర్ణమ్మ విజయవాడలోని కుమార్తె ఇంట్లో ఉంటోంది. వ్యవసాయ పనుల నిమిత్తం బావకు తెలిసిన బంధువుల వద్ద అనిల్ అప్పుగా కొంత నగదు తీసుకున్నాడు. రెండు రోజుల క్రితం శనగలు విక్రయించగా నగదు వచ్చింది. దీంతో ఆ నగదును తీసుకుని విజయవాడ వెళ్లి అప్పులు చెల్లించి తల్లిని తీసుకువస్తానని ఆదివారం ఉదయం గ్రామంలోని తన పిన్నికి, స్నేహితులకు చెప్పి విజయవాడకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ముఖానికి మఫ్లర్ ధరించడంతో పాటు చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వాహనం డ్రైవ్ చేస్తున్నాడు. మరో అర గంట ప్రయాణిస్తే విజయవాడలోని తల్లి దగ్గరకు చేరుకునేవాడు.
అయితే చినకాకాని ఎన్‌ఆర్‌ఐ జంక్షన్ ఫ్‌లై ఓవర్ దాటుతుండగా ముందు వెళ్తున్న లారీని డ్రైవర్ స్లో చేసి వెళుతున్నాడు. దానిని గమనించని అనిల్ నేరుగా లారీని ఢీకొట్టి రోడ్డుపై పడ్డాడు. తలకు బలమైన గాయం అయింది. 108 రావడం ఆలస్యం కావడంతో హైవే పెట్రోలింగ్ ఎస్‌ఐ ఎం. కృష్ణ పోలీసు వాహనంలో పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. పోలీసులు అతని బ్యాగును, అందులోని రూ.1.66 లక్షల నగదుతో పాటు సెల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతి సమాచారం అందుకున్న తల్లి, సోదరితో పాటు బంధువులు, స్నేహితులు ఆసుపత్రికి చేరుకుని విలపించిన తీరు చూపరులను కలచివేసింది.