యువతి పట్ల అనుచిత ప్రవర్తన
ఇరు వర్గాల మధ్య ఘర్షణ
రాజంపేట రూరల్: రాజంపేట పట్టణంలో గురువారం ఓ యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారనే కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మన్నూరుకు చెందిన ఓ యువతిని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడాడనే కారణంగా ఆమె సంబంధీకులు భువనగిరిపల్లెకు చెందిన యువకుడిని మందలించారు. అయినప్పటికీ అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో యువతిని కామెంట్ చేసిన యువకుని సోదరుడు గురువారం బోయనపల్లెలో ఓ వసతి గృహం వద్ద ఉండగా యువతి తరపు వారు దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న భువనగిరిపల్లెకు చెందిన యువకుని సంబంధీకులు బైపాస్ రహదారిలోని ఓ కల్యాణ మండపం వద్ద ఉన్న యువతి సంబంధీకులపై దాడికి దిగారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాలు ఆసుపత్రి వద్ద మోహరించడంతో పోలీసులు అప్రమత్తమై ఆసుపత్రి గేట్లు మూసి వేశారు. ఏఎస్‌ఐలు ఎంవీ సుబ్బయ్య, పీవీ రమణ విలేకర్లతో మాట్లాడుతూ ఘర్షణలో మన్నూరుకు చెందిన బండారు వెంకటసాయి, బండారు బాలయ్య, ముకందరగడ్డకు చెందిన అహమ్మద్‌బాషా, మరో వర్గానికి చెందిన కొరివి బ్రహ్మయ్య, కొరివి సిద్ధయ్య, వెంకటలక్షుమ్మ, జయచంద్రలు గాయపడ్డారన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.