
ప్రియుడే యముడు
♦ పద్ధతి మార్చుకోలేదని హత్య
♦ మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌లో లొంగుబాటు
తనకల్లు:
తనతో కాకుండా మరికొంతమందితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం సహించలేకపోయిన ప్రియుడు విచక్షణారహితంగా ప్రియురాలిని కడతేర్చాడు. శవాన్ని నేరుగా కారులో పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తనకల్లు మండలంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కదిరి పట్టణానికి చెందిన అశోక్‌కు భార్య సుభాషిణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశోక్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అదే పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో నివాసముంటున్న కుమార్ బ్రిక్స్, టైల్స్ వర్క్ చేసేవాడు. కుమార్ అప్పుడుప్పుడు సిమెంట్ ఇటుకలు, టైల్స్‌ని అశోక్‌కు చెందిన టాటా ఏస్ వాహనంలో తరలించేవాడు. దీంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
కుమార్ ఇంట్లో లేని సమయంలో అశోక్ వచ్చి వెళ్లేవాడు. ఆ క్రమంలోనే కుమార్ భార్య మల్లీశ్వరి(40)తో వివాహేతర సంబం«ధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుమార్.. అశోక్‌తో గొడవపడ్డాడు. కొద్దిరోజుల తర్వాత అశోక్ తిరుపతికి మకాం మార్చాడు. అక్కడే కారు పెట్టుకొని బాడుగలకు తిప్పేవాడు. దూరంగా వెళ్లినా మల్లీశ్వరితో వివాహేతర సంబంధాన్ని వదులుకోలేదు. మంగళవారం తనకల్లు మండలం కొక్కంటిక్రాస్‌కు మల్లీశ్వరిని రప్పించుకున్నాడు. అక్కడి నుంచి తన కారు(ఏపీ 03 టీవీ 5788)లో ఆమెను కూర్చోబెట్టుకొని పెట్రోల్ బంకు ఎదురుగా రోడ్డు పక్కన ఆపాడు. కారులోనే గొడవకు దిగాడు.
‘నువ్వు నాతోనే కాదు.. ఇంకా ఆరుగురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావు. వెంటనే వాటన్నింటినీ వదులుకో’ అని అశోక్ హుకుం జారీ చేయడంతో ఆమె ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన అశోక్ కొడవలితో మల్లీశ్వరి మెడపై ఐదుసార్లు నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం మృత దేహంతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయాడు. తానే ఆమెని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ తెలిపారు.