- లాడ్జీలో ఉరికి వేలాడుతుండగా గుర్తించిన సిబ్బంది
- రెండ్రోజుల కిందట మృతి చెందినట్లు అనుమానం
అనంతపురం సెంట్రల్ : అనంతపురం ఆర్టీసీ బస్టాండు రోడ్డులోని ప్రశాంతి లాడ్జీలో కదిరి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన సాయికిరణ్(27) అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉండగా గురువారం కనుగొన్నారు.
త్రీటౌన్ ఎస్‌ఐ జైపాల్‌రెడ్డి కథనం మేరకు... బీటెక్ పూర్తి చేసిన సదరు యువకుడు వారం రోజుల కిందట లాడ్జీలో అద్దెకు దిగాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఇటీవలే అతనికి ఉద్యోగం వచ్చింది. 15 రోజుల కిందట కదిరి నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన అతను హైదరాబాద్ వెళ్లొచ్చినట్లు కూడా ఆధారాలను బట్టి తెలుస్తోంది. అయితే తిరిగి ఇంటికి వెళ్లకుండా బస్టాండ్ సమీపంలో లాడ్జీలో అద్దెకు దిగాడు. ప్రతి రోజూ లాడ్జీ నిర్వాహకులతో మాట్లాడేవాడు. రెండ్రోజులుగా అతను కనిపించకపోవడంతో గదికి రాలేదేమోనని అనుకున్నారు. గురువారం పరిశీలించగా.. గది తలుపులు వేసి ఉన్నా టీవీ ఆన్‌లో ఉండడంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి తొంగిచూడగా ఉరికి వేలాడుతుండడాన్ని చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ జైపాల్‌రెడ్డి తమ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గది తలుపులను బలవంతంగా తెరిపించారు.
ఎన్నెన్నో అనుమానాలు
సాయికిరణ్ మృతి చెంది ఒక రోజు అవుతోందని లాడ్జీ నిర్వాహకులు అంటుండగా, మృతదేహాన్ని పరిశీలిస్తే రెండ్రోజుల క్రితమే చనిపోయినట్లు తెలుస్తోంది. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు బలం చేకూరేలా మృతదేహం కూడా పూర్తిగా ఉబ్బిపోయి దుర్వాసన కొడుతోంది. రక్తస్రావం కూడా జరిగి ఉండడాన్ని గుర్తించారు. అసలేం జరిగిందనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా సాయికిరణ్ చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారని తెలిసింది. ఇప్పుడు సాయికిరణ్ మృతి వెనుక ప్రేమవ్యవహారం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ కోణంలోనూ విచారణ సాగిస్తున్నారు.
యువకుడి అనుమానాస్పద మృతి
Published Thu, Jun 8 2017 11:04 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM