విజయవాడ వెళ్లేందుకు పాస్‌పోర్ట్ కావాలా?
♦ కురుక్షేత్ర సభకు అడ్డంకులు సృష్టించారు
♦ ఏపీకి రాకుండా చంద్రబాబుకుట్రపన్నారు
♦ నాకు ప్రాణహాని ఉంది.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
హన్మకొండ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు వెళ్లేందుకు పాస్‌పోర్టు తీసుకోవాలా అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రశ్నించారు. ఏపీకి వెళ్లకుండా సీఎం చంద్రబాబు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సోమవారం హన్మకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు తెలంగాణలో రక్షణ ఉంటోందని, కానీ తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రక్షణ కల్పించకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. 23 ఏళ్లుగా సామాజిక ఉద్యమాన్ని నడుపుతున్న నాయకుడిగా దేశమంతా పర్యటిస్తున్నానని తెలిపారు. పది రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం సాగుతోందని పేర్కొన్నారు. కానీ సీఎం చంద్రబాబు తనను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేందుకు అనుమతించడంలేదని చెప్పారు.
తాను ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన ప్రతిసారి తెలంగాణ సరిహద్దులో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లో వదిలి పెట్టారన్నారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారని అడిగితే పై నుంచి ఆదేశాలున్నాయని పోలీసులు చెప్పారన్నారు. అరెస్టు చేసినప్పుడు కేసులు పెట్టలేదన్నారు. 8న ఉదయం విజయవాడలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేస్తే అక్కడ వేల మంది పోలీసులను మోహరించారని తెలిపారు. 9న వరంగల్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు సూర్యపేట నుంచి వస్తుండగా తమను టీఎస్29–4878 కారు వెంబడించిందని తెలిపారు. ఈ కారులో ఎవరు ఉన్నారో తనకు తెలియదన్నారు. కాజీపేటకు రాగానే తనతో ఉన్న వారిని ఆ కారు వద్దకు పంపించి ఆరా తీయగా తాము పోలీసులమని చెప్పారని, ఆధారాలు, గుర్తింపుకార్డులు చూపాలని కోరగానే పారిపోయారని వివరించారు.
ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపిందా..? ఇతరులను పంపించారా..? చంద్రబాబు ప్రైవేట్ సైన్యమా..? ఆ వ్యక్తులెవరో తేల్చాల్సిన అవసరముందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించాలని, 24 గంటల్లో ఆ వ్యక్తులు ఎవరో తేల్చాలన్నారు. ఈనెల 7న కురుక్షేత్ర మహాసభకు అడ్డంకులు సృష్టించారన్నారు. కోర్టు సభకు అనుమతిచ్చినా సీఎం చంద్రబాబు అనుమతి ఇవ్వలేదన్నారు. తనకు ప్రాణహాని ఉందని, మానవ హక్కుల కమిషన్, కోర్టుకు వెళతానని చెప్పారు. సమావేశంలో మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్‌కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు మంద కుమార్‌మాదిగ, పుట్ట రవి, వేల్పుల వీరన్న, నకిరకంటి యాకయ్య, బొడ్డు దయాకర్, పుట్ట భిక్షపతి, సురేందర్, రాజు, నరేష్,ఈర్ల కుమార్, కరుణ పాల్గొన్నారు.