
కబాలిలో ‘మై ఫాదర్ బాలయ్య’
- కబాలి సినిమాలో తెలంగాణ రచయిత పుస్తకం
- సూపర్‌స్టార్ రజనీకాంత్ చేతిలో దర్శనం
- ‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తకానికి అంతర్జాతీయ గుర్తింపు
- ఖండాంతరాలు దాటిన వైబీ సత్యనారాయణ ఖ్యాతి
- ఆ పుస్తకంలో కళ్లకుకట్టినట్టుగా కుల వివక్ష
- చర్చనీయాంశమైన పుస్తక సారాంశం
- ‘సాక్షి’తో రచయిత ప్రొఫెసర్ వైబీ మనోగతం
తెలంగాణ రచయిత వైబీ సత్యనారాయణకు కబాలి సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈయన తన కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ రాసిన‘మై ఫాదర్ బాలయ్య’ పుస్తకం తాజాగా కబాలి సినిమాలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేతిలో దర్శనమివ్వడం చర్చనీయాంశంగా మారింది. రచయిత పుస్తకం కుల వివక్షపై, కబాలి సినిమాను జాతి వివక్ష ఆధారంగా నిర్మించడంతో ఈ పుస్తకం రజనీ చెంతకు చేరింది. రచయిత ప్రొఫెసర్ వైబీ సత్యనారాయణ మిరుదొడ్డికి వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
– మిరుదొడ్డి
కుటుంబ నేపథ్యం..
మాది కరీంనగర్ జిల్లా, కమలాపురం మండలం, వంగపల్లి గ్రామం. మా అయ్య, అవ్వ పేర్లు నర్సమ్మ, బాలయ్య. వారికి మేము ఐదుగురం సంతానం. అందులో నేను ఐదోవాడిని. మా అన్నదమ్ముల్లో ముగ్గురు డాక్టరేట్లు కావడం విశేషం. అప్పటి కాలంలో అంటరాని కులంలో ఇంత పెద్ద చదువు చదవడం చరిత్రగా చెప్పుకునే వారు. మా అయ్య రైల్వేలో చిరు ఉద్యోగిగా ఉంటటం వల్ల మా విద్యాభ్యాసం రైల్వే స్కూళ్లలోనే సాగింది. మా అయ్య ఉద్యోగి కావడంతో అప్పుడప్పుడు బదిలీల పేరిట వలస వెళ్లే వారిమి. వలస వెళ్లిన ప్రదేశాల్లో అంటరాని కులమని వివక్ష చూపించే వారు.
పుస్తకం రాయాలన్న ఆలోచన కలిగింది ఇక్కడే...
తరతరాలుగా నా కుటుంబం కులపరంగా వివక్ష ఎదుర్కొంటున్న నేపథ్యాన్ని ఒక పుస్తక రూపం ఇవ్వాలని అనిపించింది. మా ముత్తాత, తాత, మా అయ్య, నేను ఎదుర్కొన్న వివక్షకు పుస్తక రూపమిచ్చా. అందులో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాల కుటుంబాలు కుల వివక్షకు గురైతే కబాలిలో ఒక దేశ జాతి వివక్షకు గురయ్యే విధానాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది చెప్పుకోదగిన విషయం.
ఆ పుస్తకంలో ఏముందంటే...
తెలంగాణలో ఒకే కులం, ఒకే కుటుంబం నాలుగు తరాలుగా ఏ విధంగా వివక్షకు గురైందనేది పుస్తకంలో పొందుపర్చాను. అందులో ముందుగా మా ముత్తాత నర్సయ్య.. మాదిగ కులంలో పుట్టినందుకు ఎన్నో విధాలుగా వివక్షకు గురయ్యాడు. చెప్పులు కుట్టడంలో మంచి నేర్పరి. ఒకానొక సందర్భంలో నిజాం నవాబుకు మంచి చెప్పులు కుట్టి ఇవ్వాలన్న పట్టుదలతో ఓ మంచి లేత ఆవు దూడ తోలుతో సుతి మొత్తని చెప్పులు కుట్టి నవాబు కాళ్లకు తొడిగాడు. చెప్పులు కుట్టడంలో మంచి నేర్పరి తనానికి మెచ్చుకున్న నిజాం నవాబు మా మూత్తాతకు 50 ఎకరాల జమీను (భూమి) ఫరాణ (జీవో) ఇవ్వాలని ఆదేశించారు.
మాదిగ కులానికి చెందిన నర్సిగానికి నిజాం నవాబు 50 ఎకరాల భూమి ఇచ్చిన విషయం తెలుసుకున్న పటేలు... నీచపు జాతికి చెందిన నీకు ఎందుకురా 50 ఎకరాలు అంటూ 48 ఎకరాలు పటేలు స్వాధీనం చేసుకున్నాడు. కేవలం రెండు ఎకరాలు మాత్రమే సాగు చేసుకోమ్మని మా ముత్తాతను బెదిరించాడు. అప్పటికి పటేళ్లు చెప్పిందే వేదం. మా ముత్తాతకు వచ్చిన రెండు ఎకరాలు మా ముత్తాత కొడుకు పెద్ద మాదిగ నర్సయ్యకు (ముత్తాత కొడుకు పేరు కూడా నర్సయ్యనే) వారసత్వంగా వచ్చింది.
వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల్లో మా తాత నర్సయ్య, మా తాతమ్మ పోచవ్వలు మంచిగా సాగు చేసుకుంటున్న తరుణంలో పటేలు కొడుకు దౌర్జన్యం చేశాడు. రెండకరాల సాగుకు నీరందకుండా అడ్డుపడి ఉన్న ఉపాధి బందు జేయించిండు. మా తాత కొడుకు బాలయ్య (అంటే మా అయ్య) మా ఊర్లె ఆలీ సాబు అనే ముస్లిం తాత మా అయ్యకు చదువు నేర్పించాడు. ఆ చదువుతో మా అయ్య బాలయ్య రైల్వేలో చిన్న ఉద్యోగం సంపాదించుకున్నాడు.
ఉద్యోగ రీత్యా బదిలీల రూపంలో వలసలు వెళ్లేవారిమి. అక్కడ కూడా అంటరాని కులమని చాలా చులకనగా చూసేవారు. మా అయ్య బాలయ్య ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువు విషయంలో రాజీపడక పోతుండే. ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి మేము కష్టపడి చదివాం. మాకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పర్చుకున్నాం. అందుకే నేను రాసిన పుస్తకానికి ‘మై ఫాదర్ బాలయ్య’ అన్న పేరు పెట్టుకున్నా. మై ఫాదర్ బాలయ్య పుస్తకం దేశంలో ఉన్న కుల వివక్షను ఎత్తి చూపుతుంది.
కూలీ నుంచి నాయకత్వ లక్షణాల వరకు
బతుకు దెరువు కోసం వలస వెళ్లే వారి కూలీ బతుకుల్లో నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని నా పుస్తకం చెబుతుంది. ఒకే కుటుంబంలో నాలుగు తరాలు వివక్షను ఎదుర్కొన్న నేపథ్యాన్ని మై ఫాదర్ బాలయ్య తెలియ జేస్తే, ఒక దేశ జాతి వివక్షను కబాలి సినిమా తెలియజేస్తూనే కూలీ నుంచి నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని స్ఫూర్తినిస్తోంది.
కరీంనగర్‌లో సంబరాలు చేసుకున్నారు...
కబాలి చిత్రం విడుదలైన మొదటి రోజే కరీంనగర్ ప్రజలు సంబరాలు చేసుకున్నట్టు మిత్రుల ద్వారా తెలుసుకుని చాలా సంతోషించా. కబాలి చిత్ర హీరో రజనీకాంత్ చేతిలో మా కరీంనగర్ వాసి రాసిన మై ఫాదర్ బాలయ్య పుస్తకం ఉండటం చూసి జిల్లా వాసులు ఎంతో సంబరపడిపోయారు. ఒక అంతర్జాతీయ చిత్రంలో తెలంగాణకు చెందిన దళిత రచయిత రాసిన పుస్తకం కనిపించడం సంతోషంగా ఉందని తెలంగాణ ప్రజలు అభినందనలు తెలుపుతుండటం గర్వంగా ఉంది.
ఎడ్యుకేషన్ ద స్ట్రాంగెస్ట్ వెపన్
సమాజంలో అసమానతలను రూపుమాపాలంటే చదువు ఒక్కటే మార్గం. ఎడ్యుకేషన్ ద స్ట్రాంగెస్ట్ వెప(విద్య అనేది అత్యం త పదునైన ఆయుధం). ప్రతి వ్యక్తిలో విద్య అనేది ఉంటే దేశంలో పేట్రేగిపోతున్న అసమానతలను చీల్చుకుంటూ ముందుకు సాగవచ్చు. ఒక మనిషిని ఉన్నత స్థానాన్ని చేరుకోవాలంటే బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తేనే సమాజంలో తమకంటూ ఓ గుర్తింపు లభిస్తుంది.
నా అసలు పేరు...
నా అసలు పేరు ఎలుకటి సత్తయ్య. నా సతీమణి గాయత్రి. చదువుతున్న రోజుల్లో నేనే అన్నిట్లో హుషారుగా ఉన్నానని మా హెడ్‌మాస్టర్.. మా అయ్య పేరు కలిసేటట్టు ఎలుకటి బాలయ్య సత్యనారాయణగా పేరు మార్చారు.
కబాలి చేతికి ఆ పుస్తకం ఎలా వెళ్లిందంటే...
నేను రాసిన మై ఫాదర్ బాలయ్య పుస్తకం కేవలం ఇంగ్లిష్‌లోనే మార్కెట్‌లో లభ్యమయ్యేది. ప్రస్తుతం హిందీ, కన్నడ భాషల్లో అనువాదమై జాతీయ స్థాయిలో మంచి పేరు లభించింది. కాగా ఇదే పుస్తకాన్ని తమిళంలో అనువాదం చేయడానికి తమిళనాడుకు చెందిన జీనీ అనే మహిళ ఇంగ్లిష్‌లో ఉన్న మై ఫాదర్ బాలయ్యను తమిళ భాషలోకి అనువదిస్తున్నారు. ఆశ్చర్యమేమిటంటే జీనీ అనే మహిళ కబాలి డైరెక్టర్ పారంజిత్ వద్ద అసిస్టెంటు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. నాలుగు తరాల కుటుంబం వివక్షతను ఎదుర్కొంటున్న నేపథ్యం, ఒక దేశ జాతి నాలుగు తరాలుగా ఎదుర్కొంటున్న వివక్షకు దగ్గరి పోలిక ఉండటంతో మై ఫాదర్ బాలయ్య పుస్తకాన్ని డైరెక్టర్ పారంజిత్ ద్వారా తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ వద్దకు చేరింది. కబాలి చిత్ర కథకు, ఈ పుస్తకానికి ఒకే రకమైన సందేశం ఉండటంలో రజనీకాంత్ ఓకే చెప్పారు. కబాలి చిత్ర కథ ప్రారంభంలోనే హీరో రజనీకాంత్ చేతిలో ఈ పుస్తకం ఉండేలా చిత్రీకరించారు. అప్పటికే జాతీయ స్థాయిలో పేరున్న ఈ పుస్తకం కబాలి చిత్రంలో కన్పించడంతో అంతర్జాతీయంగా గుర్తింపు లభించినట్లయింది.