
రామన్న నేతృత్వంలో అంబుష్?
దుమ్ముగూడెం (భద్రాచలం) : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు నేతృత్వం వహిస్తున్న దండకారణ్య కార్యదర్శి రామన్న నేతృత్వంలోనే మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్ బలగాలపై విరుచుకుపడుతున్నట్లు తెలుస్తోంది. 40 సంవత్సరాల క్రితం దండకారణ్యంలోకి ప్రవేశించిన రామన్న కీలకనేతగా ఎదుగుతూ వచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పదేళ్లుగా సల్వాజుడుం, కోబ్రా, సీఆర్‌పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపి విస్తృత కూంబింగ్‌లు చేపట్టింది.
దీంతో మావోయిస్టుల మనుగడ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో వారు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ దాడులకు దిగుతున్నారు. ఆరు సంవత్సరాల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా చింతలనార వద్ద మావోయిస్టులు వ్యూహాత్మకంగా దాడి చేసి కూంబింగ్‌కు వచ్చిన 72 మంది సీఆర్‌పీఎఫ్ బలగాలను హతమార్చారు. ఇందులోనూ రామన్నే ప్రధాన పాత్ర పోషించినట్లు అప్పట్లో ప్రచారం సాగింది. కాగా అప్పటి నుంచి చిన్న చిన్న దాడులు చేస్తూ ఒకరిద్దరు సీఆర్‌పీఎఫ్ బలగాలను హతమార్చుతున్నారు. అయినప్పటికీ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సరిహద్దు జిల్లాల పోలీసులు ప్రణాళికాబద్ధంగా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా రంగంలోకి దిగారు.
మూడేళ్ల నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని ధర్మపేట, గొల్లపల్లి, ఎలకనగూడెం, దుమ్ముగూడెం మండల సరిహద్దులోని పైడిగూడెం, గౌరారం గ్రామాల్లో సీఆర్‌పీఎఫ్ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పని చేస్తున్నారు. దీంతో మావోల షెల్టర్ జోన్‌గా ఉన్న దండకారణ్యం కాస్త పోలీసుల చేతిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. సీఆర్‌పీఎఫ్ బలగాలు క్యాంపుల ద్వారా గ్రామస్తులకు వివిధ రకాల వస్తువులు అందజేయడంతో పాటు యువకులకు క్రీడా సామగ్రి ఇస్తూ వారిని ఆకర్షిస్తున్నారు. మావోయిస్టులు మాత్రం వ్యూహాత్మకంగా వారి రహస్య ప్రదేశాలకు చేరుకుని పోలీసులపై దాడులకు దిగుతున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో మార్చి 11న బెర్జి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు తనిఖీ చేస్తున్న సీఆర్‌పీఎఫ్ బలగాలపై దాడి చేసి 12 మందిని హతమార్చడంతో పాటు వారి వద్ద ఉన్న తుపాకులను తీసుకెళ్లారు.
అనంతరం సోమవారం చింతగుప్ప, బుర్కిపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు చేయిస్తున్న బలగాలపై మావోయిస్టులు అంబూష్ వేసి 26 మందిని హతమార్చారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చింతలనార ఘటన తర్వాత ఇదే పెద్ద సంఘటనగా పోలీసులు భావిస్తున్నారు. మావోల దాడులు తిప్పి కొట్టేందుకు పోలీసులు వ్యూహాత్మక చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.