మావోయిస్టుల్లోనే కొరియర్లు ఉన్నారు
-
జిల్లా ఎస్పీ ఎన్. రవిప్రకాష్
నెల్లిపాక :
పోలీసులకు మావోయిస్టుల్లోనే కొరియర్లు ఉన్నారని జిల్లా ఎస్పీ ఎన్. రవిప్రకాష్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం ఎటపాక లో విలేకరుల సమావేశంలో దీనిని మావోయిస్టుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసు ఇన్‌ఫార్మర్లంటూ అమాయక ప్రజలను కిరాతకంగా హత్యలు చేయటం మానుకోవాలని ఆయన మావోయిస్టులను హెచ్చరించారు. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటూ అభివృద్ధి నిరోధకులుగా మారుతున్న మావోయిస్టులకు ప్రజలే తగిన బుద్ధి చెపుతారన్నారు. ఇటీవల చింతూరు మండలంలో ఓపాస్టర్‌గా పనిచేస్తున్న గొత్తికోయను మావోయిస్టులు హత్య చేయడాన్ని ఎస్పీ తీవ్రంగా ఖండించారు. ఆ పాస్టర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. బూటకపు హత్యలు చేస్తున్న మావోయిస్టులను అంతమొందించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఏజెన్సీ ప్రజలకు తాము పూర్తి అండగా ఉంటామని, గిరిజనులు, వలస ఆదివాసీలు ధైర్యంగా ఉండాలని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఎటపాక ఓఎస్డీ డాక్టర్ ఫకీరప్ప, చింతూరు ఏఎస్పీ శ్వేత, ఎటపాక సీఐ వీరయ్యగౌడ్, ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
చింతూరు :
మావోయిస్టులకు వ్యతిరేకంగా మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం పోస్టర్లు వెలిశాయి. లచ్చిగూడెం గ్రామానికి చెందిన మారయ్య అనే పాస్టర్‌ను శనివారం మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో ఆ చర్యను ఖండిస్తూ పోస్టర్లు వెలిశాయి. మారయ్య ఫొటోలతో ఉన్న ఈ పోస్టర్లలో మానవత్వాన్ని మంటగలిపిన మావోలు. మాటల్లోనే సమాజ స్థాపన.. చేతల్లో అమాయకుల, ప్రజా సేవకుల హత్యలు. మావోయిజం అంటే హత్యలతో, మందుపాతర్లతో భయభ్రాంతులను చేయడమేనా అంటూ పోస్టర్లలో పేర్కొన్నారు.