► రామచంద్రాపురం ఉపాధి పనులపై ఆరా
►తిమ్మాపురం అడవుల్లో కదలికలు
►సీసీ కెమెరాల్లో సాయుధ వ్యక్తులు
►ఆరాతీస్తున్న నిఘా వర్గాలు
వరంగల్: మహబూబాబాద్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు, ఏటూరునాగారం, కొత్తగూడ, గూడూరు మండలాల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండేవి. భద్రాచలానికి సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు, భద్రతా దళాల మధ్య కాల్పులు రోజూ జరుగుతున్నాయి. సీఆర్‌పీఎఫ్, ఇతర భద్రతా దళాలు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నాయి. ఇటీవల సీఆర్‌పీఎఫ్ జవాన్ల దాడిలో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. దాడుల పరంపర కొనసాగుతుండడంతో మావోయిస్టులు మన రాష్ట్రంలో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.
గూడూరు–బయ్యారం సరిహద్దు తిమ్మాపురం అడవుల్లో వన్యప్రాణుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా రికార్డుల్లో ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులు సంచరించినట్లు రికార్డు అయినట్టు తెలిసింది. మావోయిస్టుల సంచారంపై ప్రాథమిక సమాచారం అందడంతో మన రాష్ట్ర నిఘా విభాగం పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు. గూడురు–బయ్యారం ప్రాంతంలో మావోయిస్టులు కదలికలు ఉన్నాయా అనే కోణంలో నిఘా పెంచారు. ఇటీవల జరిగిన సంఘటనలు ఇవీ.. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న వార్త ఈ ప్రాంతంలో సంచలనం కలిగిస్తోంది.
ఇల్లందు ఎమ్మెల్యేకు కొన్ని రోజుల క్రితం బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. అంతకుముందు మావోయిస్టుల పేరిట వాల్‌పోస్టర్ వెలిసింది. గత నెలలో గ్రామీణ తాగునీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూస్) ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు రవికుమార్ అక్రమాలకు పాల్పడుతున్నాడని, జాగ్రత్తగా ఉండాలని మహబూబాబాద్ పట్టణంలోని రైల్వే బ్రిడ్జి సమీపంలో మావోయిస్టుల పేరుతో పోస్టర్లు వెలిశాయి. అలాగే బయ్యారం మండలంలో ఉపాధి హామీ విభాగం ఫీల్డ్ అసిస్టెంట్‌ను పిలిపించి... పనులు జరుగుతున్న తీరుపై మావోస్టులు వివరాలు అడినట్లు నిఘా వర్గాలకు సమాచారం ఉంది. ఆయుధాలు కలిగి ఉన్న ఆరుగురు వచ్చారని, ఒకరు తెలుగులో మాట్లాడారని తెలిసింది. వరుస సంఘటనల నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే చర్చ జరుగుతోంది.
మానుకోటలో మావోల సంచారం
Published Wed, May 24 2017 2:00 PM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM
Advertisement
Advertisement