పిల్లలను బాగా చూసుకోండి..
బావ కొట్టాడన్న బాధతో వివాహిత ఆత్మహత్య
బుక్కాపురం(మహానంది): బావ కొట్టాడన్న బాధతో ఓ వివాహిత సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుక్కాపురంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.... గ్రామానికి చెందిన మారెడ్డి కృష్ణయ్య అలియాస్ కిట్టు, ఉమాదేవి దంపతులు. కిట్టు నంద్యాలలోని ఓ పెట్రోల్‌బంక్‌లో పనిచేసేవాడు. వీరికి నాగకార్తీక్(7 వ తరగతి), జ్యోతిక(5వ తరగతి) సంతానం. కిట్టు తల్లి కూడా వీరి వద్దే ఉండేది. ఇటీవల ఆమెకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో సుమారు రూ. 15వేల వరకు ఖర్చు పెట్టి చికిత్స చేయించారు. అయితే కిట్టు వాళ్ల అన్న వెంకటసుబ్బయ్య మాత్రం తమ తల్లిని బాగా చూసుకోవడం లేదంటూ తరచూ వారితో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో ఈ నెల 28న ఉమాదేవిపై దాడి చేసి గాయపరిచాడు.
ఈ విషయంపై కిట్టు, ఉమాదేవిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ వారితో గొడవకు పడి ఆమెను కొట్టడంతో అవమానంగా భావించి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ‘కిట్టూ...పిల్లలను బాగా చదివించి మంచి ప్రయోజకులను చేయాలని నా చివరి ఆశ. నా చావుకు కారణమైన నా బావను విడిచిపెట్టవద్దు. అత్తను బాగా చూసుకోండి. అమ్మా, నాన్నా, తమ్ముడు, అక్క మీ అందరితో చివరిసారిగా మాట్లాడాలనుకున్నాను. కానీ మాట్లాడలేకపోతున్నాను.
అందరికీ చెప్పేదేమంటే పిల్లలని బాగా చూసుకోండి. హైమావతి, పెద్దశివుడు పిల్లల్ని బాగా చూసుకోండి రా. బావ కొట్టినందువల్ల ఆ బాధను భరించలేక చనిపోతున్నా’ అంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొంది. మహానంది ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతురాలి తల్లి ఎం.కిట్టమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.