కోరుట్ల: తాళి కట్టిన భర్త పుస్తెల తాడు లాక్కెళ్లడంతో మనస్తాపానికి గురై ఓ వివాహిత ఆత్మహత్యకు యత్నించి కెనాల్ వద్ద కళ్లు తిరిగిపడిపోయిన ఘటన మహిళా దినోత్సవం రోజు కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కథలాపూర్ మండలం గంభీర్‌పూర్‌కు చెందిన ఎన్నమనేని హర్షిత అలియాస్ నాగరాణి(25)కి ఆరు నెలల క్రితం కొడిమ్యాల మండలం కోనాపూర్‌కు చెందిన ఎన్గందుల రాజేందర్(41)తో వివాహమైంది. రాజేందర్‌కు రెండో వివాహం కాగా కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య సఖ్యత కొరవడింది. ప్రతీరోజు రాజేందర్ తాగి వచ్చి హర్షితను కొట్టడం, తిట్టడం చేసేవాడు.
దీంతో విసిగిపోయిన హర్షిత కొన్ని రోజుల క్రితం గంభీర్‌పూర్‌కు వచ్చింది. శనివారం రాత్రి గంభీర్‌పూర్‌కు వచ్చిన రాజేందర్ మళ్లీ హర్షితతో గొడవపడి ఆదివారం ఉదయం పుస్తెలతాడు లాక్కెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన హర్షిత గంభీర్‌పూర్ నుంచి కోరుట్ల మండలం ఎఖీన్‌పూర్ ఎస్సారెస్పీ కెనాల్ వద్దకు వెళ్లింది. అక్కడ నీటి ప్రవాహాన్ని చూసి కళ్లు తిరిగిపడిపోయింది. చుట్టుపక్కల రైతులు ఆమెను గమనించి వివరాలు తెలుసుకుని వెంటనే బంధువులకు సమాచారమిచ్చారు. కోరుట్లలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసే హర్షిత పెద్దమ్మ కారంగుల శ్యామల కెనాల్ వద్దకు వచ్చి ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించింది. హర్షిత ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. తనకు న్యాయం చేయాలని హర్షిత కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment