జమ్మికుంట(హుజూరాబాద్): భర్త ఆత్మహత్య చేసుకోగా కూతురికి న్యాయం చేయాలని ఓ వివాహిత తన అత్తింటి ఎదుట బైఠాయించింది. ఈ ఘటన జమ్మికుంట పట్టణంలోని కృష్ణ కాలనీలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణ కాలనీకి చెందిన దాస్యపు సాయిచైతన్య, మునిగంటి మమత 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండున్నరేళ్ల కూతురు ఉంది. సాయిచైతన్య కులాంతర వివాహం చేసుకున్నాడని తల్లిదండ్రులు సత్యనారాయణ, పద్మ అతన్ని వదిలేసి కరీంనగర్‌లో ఉన్నారు. ఈ క్రమంలో చిన్నచిన్న గొడవలు జరిగి, మమత కూడా సాయిచైతన్యను వదిలేసి, కూతురిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో ఒంటరైన అతను గత డిసెంబర్‌లో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని, ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి మృతుడి తల్లిదండ్రులు కృష్ణ కాలనీలోని తమ ఇంట్లోనే ఉంటున్నారు.
తాజాగా తాను భర్త ఇంట్లోనే ఉంటానని, తన కూతురికి న్యాయం చేయాలంటూ మమత కుటుంబసభ్యులతో కలిసి సోమవారం వారి ఇంటి ఎదుట బైఠాయించింది. సాయిచైతన్య తల్లిదండ్రులు స్పందించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్సై ప్రవీణ్‌రాజ్ తన సిబ్బంది కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలని సూచించినా ఆమె వినలేదు. దీంతో సాయిచైతన్య తండ్రిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. సాయిచైతన్య ఆత్మహత్య చేసుకున్నప్పుడు కేసు నమోదు చేశామని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విచారణ చేపట్టి, చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment