
నవ వధువు ఆత్మహత్య
►ప్రేమ వివాహం చేసుకుని రెండు నెలలు గడవక ముందే దారుణం
►వేధింపులే కారణం
►మృతురాలి కుటుంబసభ్యులు
చాంద్రాయణగుట్ట: వరకట్న వేధింపులు తాళలేక పెళ్లయిన రెండు నెలల్లోనే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఉప్పుగూడ శివసాయినగర్‌కు చెందిన అనిత కుమార్తె రేణుక (20), పార్వతీనగర్‌కు చెందిన చినావత్ పవన్ ప్రేమించుకున్నారు. పవన్ తలాబ్‌కట్టలోని టిఫిన్ సెంటర్‌లో పని చేసేవాడు. ప్రేమ వివాహమే అయినా రూ.2 లక్షలు ఇస్తేనే పెళ్లికి అంగీకరిస్తామంటూ పవన్ తల్లిదండ్రులు మొండికేయడంతో కుల పెద్దలు సర్ది చెప్పి గత నవంబర్ 28న స్థానిక బంగారు మైసమ్మ ఆలయ సన్నిధిలో వివాహం జరిపించారు. పెళ్‌లై వారం రోజులు గడవక ముందే కట్నం కోసం అత్తింటివారు రేణుకను వేధించడం ప్రారంభించారు.
ఈ నేపథ్యంలో రూ. 2 లక్షలు తేవాలని పవన్ సంక్రాంతి పండుగ ముందు రేణుకను కొట్టి పుట్టింటికి పంపగా, బంధువులు సర్ధి చెప్పి అత్తగారింటికి పంపారు. అయితే ఆదివారం రాత్రి పవన్ మరోసారి ఆమెను కొట్టడంతో భరించలేని రేణుక సోమవారం మధ్యాహ్నం మంగళసూత్రంతో సహా ఆభరణాలను అక్కడే వదిలి పుట్టింటికి వచ్చింది. ఆమెను అనుసరిస్తూ వచ్చిన భర్త పవన్, అత్త విజయ తల్లిగారింటి ముందే మరోసారి రేణుకపై దాడి చేశారు. దీనిని భరించలేని రేణుక ఇంట్లోకి వెళ్లి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ తాజుద్దీన్ అహ్మద్, ఛత్రినాక ఇన్‌స్పెక్టర్ మనోజ్ కుమార్, ఎస్సై తఖియుద్దీన్ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.