
ఒంటిపై కిరోసిన్ పోసుకుని మహిళ ఆత్మహత్య
తాడేపల్లిగూడెం రూరల్ : వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని పట్టింపాలెంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టింపాలెంకు చెందిన కిక్కిరిశెట్టి గణేష్‌కు పెంటపాడు మండలం చింతపల్లికి చెందిన సత్యవేణిలకు 2011 ఫిబ్రవరి 12న వివాహమైంది. వివాహ సమయంలో గణేష్‌కు రూ.5 లక్షల కట్నం, లాంఛనాలు అందజేశారు.
కొంతకాలం వీరి సంసారం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు గ్రీష్మ లక్ష్మీ దుర్గ(3), కుసుమ (8 నెలలు) కలిగారు. ఇద్దరూ ఆడపిల్లలు కావడంతో అధిక కట్నం కోసం అత్తవారు వేధించడంతో ప్రారంభించారు. ఈ క్రమంలో వేధింపులు తాళలేక సత్యవేణి శనివారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.
తల్లి పోతుల మణి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలాన్ని తాడేపల్లిగూడెం రూరల్ సీఐ గుమ్మళ్ల మధుబాబు, మండల మేజిస్ట్రేట్ పాశం నాగమణి, ఎస్సై వి.చంద్రశేఖర్ పరిశీలించారు. వరకట్న వేధింపుల కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మతురాలు అత్త లక్ష్మీ నర్సమ్మ, భర్త గణేష్, ఆడపడుచు దుర్గా భవానీలను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా సత్యవేణి మతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయ్యో పాపం పిల్లలు..
‘ఇద్దరు ఆడపిల్లలను తల్లి ఒంటరి చేసి పోయిందే’ అని సత్యవేణి బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కంట తడి పెట్టించింది. ఐదేళ్ల, ఎనిమిది నెలల కుమార్తెలు ఇద్దరికీ తమ తల్లి ఏమైపోయిందో తెలియక రోదిస్తుంటే చూపరులు చలించిపోయారు. సత్యవేణి మతితో ఇటు పట్టింపాలెంలోను, అటు చింతపల్లిలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.