Published
Sat, Oct 1 2016 1:23 AM
| Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
భర్తే హతమార్చాడని అనుమానం
నెల్లూరు(క్రైమ్): వివాహిత అదృశ్యంపై శుక్రవారం రాత్రి నాలుగో నగర పోలీసులకు ఫిర్యాదు అందింది. భర్తే హత్యచేసి ఉంటాడని వివాహిత తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వివరాలు.. కర్నూలు జిల్లా ధర్మవరానికి చెందిన విశ్రాంత కోఆపరేటివ్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ నతానియన్ నాలుగో కుమార్తె వినీత(28). నాలుగేళ్ల క్రితం చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన సుధీర్‌కుమార్‌బాబు ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతుండగా వినీతతో పరిచయం ఏర్పడింది. వీరి ప్రేమను ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో పారిపోయి నాలుగేళ్ల క్రితం తిరుమలలో వివాహం చేసుకున్నారు. ఏడాదిగా దంపతులిద్దరూ అరవిందనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. సుధీర్‌కుమార్ బాబు ప్రస్తుతం నారాయణ మెడికల్ కళాశాలలో హౌస్‌సర్జన్‌గా పనిచేస్తున్నారు. వినీతపై అతనికి అనుమానంతో దంపతుల నడుమ కలతలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి సుధీర్‌కుమార్ తన మామ నతానియన్‌కు ఫోన్ చేసి వినీతను చంపేశానని చెప్పి ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశాడు. కుమార్తె ఫోన్‌కు చేయగా, స్విచ్ఛాఫ్ వచ్చింది. నతానియన్ నెల్లూరు పోలీసులకు విషయం చెప్పడంతో నాలుగో నగర ఇన్‌స్పెక్టర్ సీతారామయ్య అరవిందనగర్‌లోని సుధీర్‌కుమార్ బాబు ఇంటికి వెళ్లాడు. తలుపు తాళం పగలగొట్టి పరిశీలించగా అక్కడ ఎవరూ లేకపోవడంతో వెనుదిరిగారు. ఇదే విషయాన్ని నతానియన్‌కు ఫోన్లో తెలిపారు. శుక్రవారం రాత్రి నెల్లూర చేరుకున్న నతానియన్ తన కుమార్తె అదృశ్యంపై నాలుగో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వినీతను భర్తే హత్యచేసి మాయం చేసి ఉంటాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్ దర్యాప్తు చేపట్టారు. సదరు ఇంటి వద్దకు వెళ్లి విచారించగా సుధీర్‌కుమార్‌బాబు రెండు పెద్ద సూట్‌కేసులను తీసుకొని కారులో గురువారం తెల్లవారుజామున వెళ్లిపోయాడని స్థానికులు తెలిపారు. మరోవైపు సుధీర్‌కుమార్‌బాబు భార్యను హత్యచేసి రెండు ముక్కలుగా చేసి సూట్‌కేసుల్లో తిరుపతికి తీసుకెళ్లాడనే వదంతులు వినిపిస్తున్నాయి. సదరు బ్యాగ్‌లను అక్కడే వదిలేసి పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది. అయితే పోలీసులు మాత్రం సుధీర్‌బాబు కోసం తిరుపతిలో గాలిస్తున్నామని వెల్లడించారు.