-
బ్యూటిఫుల్ స్కార్ఫ్..పెంటాస్టిక్ పేస్‌మాస్క్
-
బైక్ ప్రయాణాల్లో ఉపయోగం
-
దుమ్ము, ధూళి నుంచి రక్షణ
-
ఆసక్తి చూపుతున్న యువత
కరీంనగర్ బిజినెస్ : రయ్‌మంటూ బైక్‌లపై దూసుకెళ్లే యువత గమ్యస్థానం చేరే వరకు ముఖాలు మసిబారిపోతున్నాయి. ఆఫీస్‌కు, కాలేజీలకు వెళ్లేందుకు అందంగా ముస్తాబై బైక్‌పై వెళ్తుంటే ముందు వెళ్లే వాహనం నుంచి వచ్చే పొగ, రోడ్డుపై వచ్చే దుమ్ముతో ముఖాలు మసకబారిపోతుంటాయి. అయితే వీటన్నింటినికి చెక్ పెట్టేందుకు యువకులు ఫేస్‌మాస్క్‌లు, ఆడవాళ్లు స్కార్ఫ్‌లు ధరిస్తున్నారు. ఎండ, చలి, పొగ, దుమ్ము, ధూళీ నుంచి రక్షణ కల్పిస్తున్నాయి. ఫుల్‌స్కార్ఫ్, హాఫ్‌స్కార్ఫ్, రైడర్‌మాస్క్‌లు, నింజా, మల్టీపర్పస్ స్నఫ్, బైకర్స్, అగస్టా, ఫేస్ సేఫ్, ఫేస్‌రిచ్ వంటి పేర్లతో వివిధ మోడళ్లలో లభిస్తున్నాయి. ఆకర్షణీయమైన డిజైన్‌లలో లభిస్తుండడంతో గిరాకీ కూడా బాగుంటుందని వ్యాపారులు అంటున్నారు.
స్కార్ఫ్‌తో రక్షణగా
మహిళలు, యువతులు స్కార్ఫ్ కట్టుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ద్విచక్రవాహనాలపై ప్రయాణించినప్పుడు చాలా మంది ఎండ నుంచి తట్టుకునేందుకు, చలి నుంచి కాపాడుకునేందుకు స్కార్ఫ్ కవచంగా పనిచేస్తుందంటున్నారు యూత్. మహిళలకు ప్రత్యేకంగా రకరకాల డిజైన్‌లలో లభిస్తుండడంతో ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థినిలు, ఉద్యోగులు ఎక్కువగా స్కార్ఫ్ వాడుతున్నారు. వీటి ధరలు రూ.100 నుంచి రూ.200 వరకు అందుబాటులో ఉన్నాయి.
రైడర్‌మాస్క్‌లతో రయ్..రయ్
కుర్రకారు రైడర్‌మాస్క్‌లతో రయ్‌మంటున్నారు. ఇవి పలురకాల రంగులలో స్పోర్ట్స్ రైడర్స్ ఉపయోగించే లా ఉంటాయి. ఇందులో రెండు రకాలు.. సింగిల్‌కలర్, మల్టీకలర్స్. ముఖానికి గరుకుగా ఉండి ఇబ్బందిపెట్టకుండా ఉండే సాఫ్ట్‌క్లాత్‌తో వీటిని తయారు చేస్తారు. వీటి ధరలు దాదాపు రూ.150 నుంచి రూ.250 వరకు ఉన్నాయి.
నింజామాస్క్
ముఖానికి నిండుగా ఉంటూ పైభర్ క్లాత్‌తో నింజా మాస్క్‌లు తయారవుతాయి. ఇది ముఖాన్ని పూర్తిగా కప్పేస్తుంది. దీని ధర దాదాపు రూ.120 నుంచి రూ.150 వరకు ఉంది.
బైకర్స్
వీటిని హాఫ్ మాస్క్‌లని కూడా అంటారు. కేవలం ముక్కు, చెవులను కప్పేందుకు ఉపయోగపడతాయి. కొందరికి హెల్మెట్ ధరించే ఇష్టం లేక రుమాల్, హ్యాండ్‌కీలను కట్టుకుంటున్నారు. ఇలాంటి వారికి ఈ మాస్కులు చాలా ఉపయోగం. వీటి ధరలు నాణ్యతను బట్టి రూ.90 నుంచి రూ.120 వరకు ఉన్నాయి.
మల్టీపర్పస్ స్నఫ్
ఇవి కేవలం ఒకే రకాలుగా కాకుండా వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. ఒకటే స్నఫ్ 8 రకాలుగా ముఖాన్ని సంరక్షించేందుకు ఉపయోగపడుతుంది. హాఫ్, ఫుల్, రౌండ్ మోడళ్లుగా వాడుకోవచ్చు.
అగస్టాతో సేఫ్
ఇవి దుమ్ము, దూళి నుంచి రక్షణకు ప్లాస్టిక్ మూత ఉంటుంది. చాలా దుమ్ము, దూళి కలిగిన ప్రదేశాల్లో మట్టి రోడ్లపై రక్షణగా ఉపయోగపడతాయి. వీటి ధరలు నాణ్యతను బట్టి రూ.120 నుంచి రూ.150 వరకు ఉన్నాయి.
నగరంలో దుకాణాలు
నగరంలోని పలు ప్రదేశాల్లో మాస్క్‌ల దుకాణాలు నగర ప్రజలకు స్వాగతం పలుకుతున్నాయి. బస్టాండ్‌లో, బస్టాంట్‌వెలుపల, టవర్‌సర్కిల్, కొర్డురోడ్, రాంనగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఉన్న టోపీల దుకాణాలు, ఫుట్‌పాత్ షాపులు, మంచిర్యాల రోడ్, గోదావరిఖనిరోడ్, పద్మనగర్ శివారుల్లో ఫుట్‌పాత్ దుకాణాల్లో లభిస్తున్నాయి.
రక్షణగా..
– రాజు, బీటెక్ విద్యార్థి
మనం ఎంత అందంగా ముస్తాబైన రోడ్డుపై ప్రయాణిస్తే పది నిమిషాల్లో ముఖం వాడిపోతుంది. ఎండ, దుమ్ము, ధూళి , పొగ నుంచిరక్షణగా ఈ మాస్క్‌లు ఉపయోగకరంగా ఉంటాయి. మార్కెట్లో వివిధ రకాల డిజైన్‌లలో లభిస్తున్నాయి.
దుమ్ము ధరిచేరకుండా
– సంతోష్‌చారి , వ్యాపారి
పనిమీద బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరిస్తాను. అన్ని కాలాల్లో చాలా ఉపయోగం. డస్ట్ ఎలర్జీ ఉన్న వారు ఈ మాస్క్‌లు ధరించి ధైర్యంగా ప్రయాణం చేస్తున్నారు. ముఖ్యంగా యువకులు బైక్‌లపై మాస్క్‌లు ధరిస్తున్నారు.