హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం మరింత వాడివేడిగా కొనసాగనున్నాయి. రెండు రోజులపాటు ప్రశ్నోత్తరాలు ఇతర వ్యవహారాలను రద్దు చేసి రైతుల ఆత్మహత్యలపై చర్చ జరిపిన ప్రభుత్వం ప్రతిపక్షాల వాణిని పట్టించుకోలేదు. వారికి పూర్తి స్థాయిలో సమాధానం ఇవ్వకుండానే సభను బుధవారం వాయిదా వేశారని ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. మరోపక్క, గురువారంనాటి సమావేశంలో ప్రశ్నోత్తరాలు ప్రారంభంకానున్నాయి. గంటన్నరపాటు ప్రశ్నోత్తర కార్యక్రమం ఉండనుంది. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం కొన్ని బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని భావిస్తుండగా ఇటు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాలతో సిద్ధమయ్యాయి.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాట్ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. విద్యుత్ రంగంపై కూడా కొంత సమయం చర్చ జరగనుంది. ఇక వరంగల్లో ఎన్ కౌంటర్పై చర్చ చేపట్టాలని సీపీఐ, సీపీఎం వాయిదా తీర్మానంతో పట్టుబట్టనుంది. మరోపక్క, ప్రతిపక్షాలపై దాడులు, జిల్లాలో ప్రొటోకాల్ ఉల్లంఘన అంశంపైన కాంగ్రెస్ పార్టీ, జీహెచ్ఎంసీలో తొలగించిన కార్మికులను వెంటనే వెనక్కి తీసుకోవాలని బీజేపీ, ఎర్రబెల్లి దయాకర్ అరెస్టుపై చర్చ చేపట్టాలని టీడీపీ వాయిదా తీర్మానాలు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో సభలో కొంత గందరగోళం నెలకొనే అవకాశం ఉంది. దీంతోపాటు ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా ఉండొచ్చు.
'మాటల యుద్ధం తప్పదేమో'
Published Thu, Oct 1 2015 9:21 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM
Advertisement
Advertisement