
అధికార ‘స్వరూపం
– బీఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ స్థలంలో ట్యాంకు నిర్మాణం
– కోర్టు నిబంధనలనూ పట్టించుకోని ప్రథమ పౌరురాలు
– తహశీల్దార్ వారించినా వినని మేయర్
– అధికారుల తీరును తప్పుబట్టిన బీఎన్‌ఆర్ సోదరులు
అనంతపురం న్యూసిటీ : మేయర్ తన అధికార స్వరూపాన్ని మరోసారి నిరూపించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన దూకుడును ప్రదర్శించారు. న్యాయస్థానాలపై గౌరవం లేకుండా మేయర్ వ్యవహరించిన తీరు పై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. బీఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌లో నీటి ట్యాంకు ఏర్పాటు చేయడంపై మేయర్‌పై క్రిమినల్ కేసు పెట్టేందుకు సైతం అధికారులు సిద్ధమయ్యారు. వివరాల్లోకెళితే అనంతపురంలోని మిస్సమ్మ స్థలంలో ఆదివారం ఓ ట్యాంకు నిర్మాణం చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థల యజమానులు బీఎన్‌ఆర్ సోదరులు ఎర్రిస్వామి రెడ్డి, రెడ్డప్పరెడ్డి తహశీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ వెళ్లే సమయానికి మేయర్ దగ్గరుండి ట్యాంకు పనులు చేయిస్తున్నారు.
ఇది చట్ట విరుద్ధమని, తక్షణం నిర్మాణ పనులు ఆపాలని తహశీల్దార్ శ్రీనివాసులు మేయర్‌కు సూచించారు. ఇక్కడ నిర్మాణాలు చేపడితే కోర్టు ధిక్కారమే అవుతుందని తేల్చి చెప్పారు. చట్టాలు తమకూ తెలుసునని మేయర్ బుకాయించారు. దీంతో మేయర్, తహశీల్దార్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మేడమ్.. మీరు ప్రథమ పౌరురాలు మీరే ఇలా చేస్తే ఎలా? అని తహశీల్దార్ మేయర్‌ను నిలదీశారు. ఇప్పుడే ప్రభుత్వ న్యాయవాదితో మాట్లాడానని , నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పారన్నారు. దీనికి మేయర్ స్పందిస్తూ .. తమకు ఏది న్యాయమో తెలుసన్నారు. మేయర్ అనుచరులు సైతం తహశీల్దార్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించి తహశీల్దార్‌ను తోసేందుకు యత్నించారు. చివరకు మేయర్... ఎమ్మెల్యేతో మాట్లాడాలని తహశీల్దార్‌కు ఫోన్ ఇచ్చారు. తహశీల్దార్... ఎమ్మెల్యేకు పరిస్థితిని వివరించారు. చివరకు తహశీల్దార్ అందరినీ వీడియో తీయాలని కేసు పెడతామని హెచ్చరించారు.
ఈ స్థలం బీఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌దే
– తహశీల్దార్‌తో బీఎన్‌ఆర్ సోదరులు
హై కోర్టు ఈ స్థలం బీఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు చెందిందని కోర్టు తీర్పిచ్చింది. ఇక్కడ ఏం నిర్మాణం చేపట్టాలన్నా బీఎన్‌ఆర్ వారితో అనుమతి తీసుకోవాలని చెప్పారు. దోమలు అధికమయ్యాయని శుభ్రం చేసుకుంటామని కోరితే పట్టించుకోలేదు. ఇవాళ ట్యాంకు కడుతున్నారని అడ్డు చెబితే పక్షులకంటే వేగంగా వచ్చారు. మీరు మెజిస్ట్రేట్‌గా వచ్చారా.? లేక రాజకీయ నాయకుల తొత్తులుగా వచ్చారా.? జిల్లా కలెక్టర్, ఆర్‌డీఓ సైతం ఈ స్థలం ప్రభుత్వానికి కాదని చెప్పారు. రైట్ రాయల్‌గా ఈ స్థలాన్ని కొనుగోలు చేశాం.
నా మాట విననప్పుడు ఏం చేయాలి
– తహశీల్దార్
కోర్టును ధిక్కరించి నిర్మాణాలు చేపడుతున్నాని చెప్పా. కానీ మేయర్ వినలేదు. నేనేమి చేయాలి. సమస్యను జిల్లా కలెక్టర్ దష్టికి తీసుకెళ్తా.