మేడారానికి భక్తుల తాకిడి
ఎస్‌ఎస్ తాడ్వాయి : మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలను దర్శించుకునేందు కు ఆదివారం పెద్దసంఖ్యలో భక్తులు వచ్చారు. ఏటూరునాగారంలోని రామన్నగూడెం, మంగపేట గోదావరిలో అంత్య పుష్కరాలకు వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో మేడారంలోని వనదేవతల సన్నిధికి చేరుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఈసందర్భంగా భక్తులు వన దేవతలకు పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం సమర్పించి పూజలు నిర్వహించారు.
గద్దెలకు మరమ్మతులు
కాగా, మేడారంలోని అమ్మవార్ల గద్దెలకు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. గాయత్రి గ్రానైట్స్ ఆధ్వర్యంలో గత ఫిబ్రవరిలో జాతర సందర్భంగా అమ్మవార్ల గద్దెలకు గ్రానైట్ వేశారు. జాతరకు వచ్చిన భక్తులు గద్దెలపైకి కొబ్బరి, బెల్లం విసరడంతో గ్రానైట్ రాళ్లు పగిలాయి. పగిలిన రాళ్లను తొలగించి కొత్త వాటిని గద్దెలపై అమర్చే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.