కేక పెట్టించారు..
అనంతపురం మెడికల్ : వారంత కాబోయే వైద్యులు.. అహర్నిశం పుస్తకాలతో కుస్తీ పట్టే వీళ్లంతా కొద్ది సేపు హల్‌చల్ చేశారు. తమ ఆటపాటలతో ఆహుతులను అలరించారు. యువతను కేకపెట్టించారు. ఇందుకు అనంతపురంలోని మెడికల్ కళాశాల గురువారం వేదికైంది. అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ‘ఫ్రెషర్స్ డే’ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
మంచి డాక్టర్లుగా పేరు తెచ్చుకోండి
‘మెడికల్ ర్యాంక్ ఎంత వచ్చిందన్నది ముఖ్యం కాదు. కోర్సు పూర్తయ్యేలోగా మనం ఎంత నేర్చుకున్నామన్నది ముఖ్యం. బాగా చదువుకుని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి. ఉత్తమ డాక్టర్లుగా ఎదగండి. పవిత్రమైన వైద్య వత్తిని ఎంచుకున్నందుకు మానవతా విలువలతో పేదలకు సేవ చేయండి’ అంటూ వైద్య విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ రాజశేఖరాబు సూచించారు. ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. ప్రపంచంలో శరవేగంగా చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ఉన్నతులుగా ఎదగాలన్నారు. విద్యార్థుల్లో సజనాత్మకత పెరిగేలా చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావుకు సూచించారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ చిట్టినరసమ్మ, సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్‌లు మాట్లాడుతూ ఇక్కడ మంచి వాతావరణంలో విద్యను అభ్యసించి భావితరాలకు ఆదర్శంగా ఉండాలన్నారు. అనంతరం 2016 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులకు ఐడీ కార్డులు, వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైద్యులు సంపత్‌కుమార్, ప్రవీన్‌దీన్ కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆదిరెడ్డి పరదేశినాయుడు, వైద్య విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
డాన్సులు, స్కిట్లతో ఆదరగొట్టిన మెడికోలు
ఉత్సాహం ఉరకలెత్తింది. వైద్య విద్యార్థుల డ్యాన్స్‌లు, కేరింతలతో అనంతపురం మెడికల్ కళాశాల ఆడిటోరియం దద్దరిల్లింది. ఫ్రెషర్స్ డే సందర్భంగా గురువారం నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలు అలరించాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభమైన ‘యువ జోష్’ సాయంత్రం 4 గంటల వరకు నిర్విరామంగా కొనసాగింది. ‘ప్రణామం..ప్రణామం’ అంటూ ప్రారంభమై ‘వందేమాతరం..’ అంటూ ముగింపు ఇచ్చారు. మధ్యమధ్యలో రీమిక్స్ గీతాలు, స్కిట్లు అలరించాయి. రోగాలతో సతమతమవుతున్న జనాన్ని వచ్చీరాని వైద్యంతో చంపొద్దంటూ ‘జనతా క్లినిక్’ పేరుతో ఇచ్చిన సందేశం ఆలోచింపజేసింది. ‘ఆకు చాటు పిందె తడిసె’.. ‘నా కళ్లు చెబుతున్నాయి’ అంటూ తన ప్రేమను తెలియజేసిన వేళ ‘ఆకాశంలో ఒక తార’ రాలినట్టు కన్పించి ‘ఐ వాన్న ఫాలోఫాలోఫాలో యూ’ అంటూ వెంటపడి ‘దివి నుంచి దిగివచ్చిన ఆపిల్ బ్యూటీ’ని ప్రశ్నించింది.
అంతలోనే అమ్మాయిలు ‘గోరీ తేరా ఝుంకా’.. ‘నాచేంగే సారే రాత్’ అంటూ హుషారెత్తించారు. వెను వెంటనే ‘సునో జోర్‌సే దునియావాలే’ అంటూ ‘కబాలి’ ఎంటరయ్యాడు. ఆ తర్వాత ‘సోగ్గాడే చిన్ని నాయన’ వచ్చి ‘శుభలేఖా రాసుకున్నా మదిలో ఎప్పుడో’ అంటూ ‘ఒకలైలా కోసం..తిరిగి’ ‘రామ్మా చిలకమ్మా..ప్రేమా మొలకమ్మా..’ అంటూ విన్నవించుకున్నాడు. అంతలోనే ‘ముంతలో కల్లు ఊరిస్త ఉంటే’ ‘నిలువద్దము నిను ఎపుడైనా..నువు ఎవ్వరు అని అడిగేనా’ అంటూ ‘గర్ల్‌ఫ్రెండ్ లేని లైఫె వేస్ట్ కదా..!’ అని కేక పుట్టించారు. చివరగా ‘దసరా వచ్చిందయ్యా.. సరదా తెచ్చిందయ్యా’.. అంటూ గ్రామీణులు ఉల్లాసంగా ఉన్న వేళ యుద్ధం ప్రారంభం కావడంతో ‘దేశం మనదే’ అంటూ వెళ్లి శత్రువులతో పోరాడాక ఓ జవాను అమరుడైతే అతడి పార్థివదేహాన్ని స్వగ్రామానికి తెచ్చిన వేళ కాసేపు అందరూ ఉద్వేగానికి లోనై కంటతడి పెడుతూ ‘వందేమాతరం’ అంటూ ముగించారు.