3న మెడికల్ రెప్‌ల సమ్మె
Published Sun, Jan 29 2017 12:09 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
కర్నూలు (హాస్పిటల్): ఆరోగ్య, మందుల అంశాలపై ఫిబ్రవరి 3వ తేదీన సమ్మె చేయనున్నట్లు ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రెప్రజెంటేటీవ్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు వెంకట్, కోటేశ్వరరావు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని మీడియా పాయింట్ వద్ద సమ్మెకు సంబంధించి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందులు, మందుల పరికరాలు, ధరలు రోజురోజుకూ సామాన్య మానవుడికి అందని ద్రాక్షగా మారాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మందుల ధరలను నియంత్రించకుండా ఆ అధికారం మందుల తయారీ కంపెనీలకు కట్టబెట్టిందన్నారు.
ఉదాహరణకు ఆమ్లోడిపిన్ 5ఎంజీ అనే డీబీ మందు (15 మాత్రలు) తయారీకి రూ.3.18 ఉంటే దాని అమ్మకం రూ.43.90 పైసలు ఉందన్నారు. ఇప్పుడు అమ్మకపు ధరపై సుంకం వేయడం వల్ల మందుల ధరలు మరింత పెరగడానికి కారణమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసే విధంగా ఉన్నాయని విమర్శించారు. మందులు, మందుల పరికరాల ధరలు నియంత్రించాలని, వీటిపై ఎక్సైజ్ సుంకం, వాణిజ్య, జీఎస్‌టీ పన్నులు ఉండకూడదన్నారు. ప్రభుత్వ రంగ మందుల కంపెనీలను, వ్యాక్సిన్ ప్లాంట్లను కాపాడాలని, మందుల రంగంలో బహుళజాతి సంస్థల పెట్టుబడులను అదుపుచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ జిల్లా నాయకులు పెద్దస్వామి, మోయినుద్దీన్, షేక్షావలి, బసవరాజు, రవీంద్రారెడ్డి, శివరంగ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Advertisement